Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత | Paris Olympics: India earn mens and women team quotas in Archery | Sakshi
Sakshi News home page

Paris Olympics: ఒలింపిక్స్‌కు భారత ఆర్చరీ జట్లు అర్హత

Jun 25 2024 5:56 AM | Updated on Jun 25 2024 5:56 AM

Paris Olympics: India earn mens and women team quotas in Archery

మూడు విభాగాల బరిలో ధీరజ్‌

నాలుగోసారి ఒలింపిక్స్‌లో పోటీపడనున్న తరుణ్‌దీప్, దీపిక 

న్యూఢిల్లీ: మూడు క్వాలిఫయింగ్‌ టోరీ్నల ద్వారా వీలుకాకపోయినా వరల్డ్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా భారత పురుషుల, మహిళల ఆర్చరీ జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. క్వాలిఫయింగ్‌ టోరీ్నల ద్వారా ఇప్పటికే ఒలింపిక్‌ బెర్త్‌లు దక్కించుకున్న 10 జట్లను మినహాయించి... వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో రెండు అత్యుత్తమ జట్లకు మిగిలిన రెండు బెర్త్‌లను కేటాయించారు. పురుషుల విభాగంలో భారత్, చైనా... మహిళల విభాగంలో భారత్, ఇండోనేసియా జట్లకు ఈ అవకాశం లభించింది.

 ఫలితంగా వచ్చే నెలలో జరిగే పారిస్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో భారత్‌ పురుషుల, మహిళల టీమ్‌ విభాగాల్లో, వ్యక్తిగత విభాగాల్లో, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడు విభాగాల్లో (టీమ్, వ్యక్తిగత, మిక్స్‌డ్‌) పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 44 ఏళ్ల తరుణ్‌దీప్‌ రాయ్‌... మాజీ నంబర్‌వన్‌ దీపికా కుమారి నాలుగోసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనున్నారు. మహిళల వ్యక్తిగత విభాగంలో, మిక్స్‌డ్‌ విభాగంలో భజన్‌ కౌర్‌ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది.  
భారత పురుషుల ఆర్చరీ జట్టు: తరుణ్‌దీప్‌ రాయ్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్‌ జాధవ్‌. భారత మహిళల ఆర్చరీ జట్టు: దీపికా కుమారి, భజన్‌ కౌర్, అంకిత. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement