సురుచికి స్వర్ణం... ఇషా సింగ్‌కు రజతం  | Suruchi Singh and Esha Singh won a gold and silver medal | Sakshi
Sakshi News home page

సురుచికి స్వర్ణం... ఇషా సింగ్‌కు రజతం 

May 30 2026 6:39 AM | Updated on May 30 2026 6:39 AM

Suruchi Singh and Esha Singh won a gold and silver medal

మ్యూనిక్‌: ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో శుక్రవారం భారత మహిళా పిస్టల్‌ షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో హరియాణా షూటర్‌ సురుచి సింగ్‌ స్వర్ణ పతకాన్ని సాధించగా... తెలంగాణ షూటర్‌ ఇషా సింగ్‌ రజత పతకాన్ని సంపాదించింది. గత ఏడాది ఇదే టోరీ్నలో సురుచి బంగారు పతకం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. రెండో ఏడాది కూడా నిలకడైన ప్రదర్శనతో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకుంది. 

ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో సురుచి సింగ్‌ 242.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఇషా సింగ్‌ 241.2 పాయింట్లతో రెండో స్థానం సంపాదించి రజత పతకాన్ని గెలిచింది. గెయున్‌ చూ (దక్షిణ కొరియా) 220.2 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 

అంతకుముందు 121 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్‌లో సురుచి సింగ్, ఇషా సింగ్‌ 578 పాయింట్లు స్కోరు చేసి వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. మరోవైపు పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ విభాగంలో భారత షూటర్‌ ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌ 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంతో ఫైనల్లోకి ప్రవేశించాడు. అయితే అతను వాడిన రైఫిల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో అతనిపై అనర్హత వేటు వేశారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో భారత షూటర్లు అనీశ్‌ 27వ స్థానంలో, ఉదయ్‌వీర్‌ సిద్ధూ 37వ స్థానంలో, సూరజ్‌ శర్మ 39వ స్థానంలో నిలిచారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement