
దాదాపు ఏడాది విరామం తర్వాత పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేయనున్నాడు. శ్రీలంక- జింబాబ్వే- పాకిస్తాన్ మధ్య జరిగే టీ20 ట్రై సిరీస్‌కు ముందుకు సెలక్టర్లు అతడిని కనికరించారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ (Pak vs SA T20Is) ఆడే పాక్ జట్టులో అతడికి చోటు ఇచ్చారు.
ఏడాది కాలంగా దూరం
కాగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా బాబర్ పాకిస్తాన్ తరఫున చివరగా టీ20 ఆడాడు. ఆ సిరీస్‌లో విఫలమైన కారణంగా సెలక్టర్లు బాబర్‌పై వేటు వేశారు. దాదాపు ఏడాది కాలంగా అతడిని టీ20 జట్టుకు దూరంగా ఉంచారు.
అయితే, సొంతగడ్డపై జరిగే సౌతాఫ్రికాతో జరిగే తాజా టీ20 సిరీస్‌కు బాబర్‌ను ఎంపిక చేయడం విశేషం. ఆ తర్వాత పాక్ శ్రీలంక- జింబాబ్వేలతో టీ20 ట్రై సిరీస్ ఆడనుంది. నిజానికి శ్రీలంక- అఫ్గనిస్తాన్ జట్లతో పాక్ ముక్కోణపు టీ20 సిరీస్ ఆడాల్సింది.
అయితే, పాక్ వైమానిక దాడుల్లో అఫ్గన్‌కు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు దుర్మరణం చెందడంతో అఫ్గన్ బోర్డు ఈ సిరీస్ నుంచి విరమించుకుంది. ఈ నేపథ్యంలో జింబాబ్వేను బతిమాలుకున్న పాక్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు ఆ జట్టును సిరీస్ ఆడేలా ఒప్పించింది.
రిజ్వాన్‌కు మరో భారీ షాక్
ఇక సౌతాఫ్రికాతో టీ20 జట్టుకు సల్మాన్ ఆఘాను టీ20 కెప్టెన్‌గా కొనసాగించిన పాక్ బోర్డు.. వన్డేల్లో ఈ సిరీస్‌తో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌గా ప్రయాణం ఆరంభిస్తాడని తెలిపింది. అయితే, వన్డే కెప్టెన్‌గా తప్పించిన మొహమ్మద్ రిజ్వాన్‌కు మాత్రం యాజమాన్యం మరో షాకిచ్చింది. కనీసం జట్టులోనూ అతడికిస్థానం ఇవ్వలేదు. ఇప్పటికే టీ20 జట్టులో చోటు కోల్పోయిన రిజ్వాన్‌కు.. వన్డేలలోనూ మొండిచేయే ఎదురైంది.
కాగా పాక్ జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌తో బిజీగా ఉంది. తొలి టెస్టులో వరల్డ్ చాంపియన్లను ఓడించిన షాన్ మసూద్ బృందం.. రెండో టెస్టులో మాత్రం ఓటమి పాలైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్ సమమైంది.
సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు (అక్టోబరు 28- నవంబరు 1)
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీఖ్.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు (నవంబరు 4- 8)
షాహీన్ షా అఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసీబుల్లా ఖాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ వసీం, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, సల్మాన్ ఆఘా.
చదవండి: డకౌట్ తర్వాత కోహ్లి చర్య వైరల్.. గుడ్‌బై చెప్పేశాడా?