BCCI: వరల్డ్‌కప్‌ ఓపెనర్‌ రేసులో ఊహించని పేరు! | ODI WC 2027: Vaibhav Sooryavanshi Challenge To Rohit Yashasvi Jaiswal | Sakshi
Sakshi News home page

ODI WC 2027: భారత ఓపెనర్‌ రేసులో ఊహించని పేరు!

May 23 2026 4:15 PM | Updated on May 23 2026 5:11 PM

ODI WC 2027: Vaibhav Sooryavanshi Challenge To Rohit Yashasvi Jaiswal

భారత క్రికెట్‌లో సరికొత్త సంచలనం వైభవ్‌ సూర్యవంశీ. గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బిహారీ పిల్లాడు.. ఫాస్టెస్ట్‌ సెంచరీ (35 బంతుల్లో)తో దుమ్ములేపాడు. ఆ తర్వాత భారత అండర్‌-19 జట్టు తరఫున, వరల్డ్‌కప్‌-2025లో సత్తా చాటాడు.

గాలివాటం కాదు
ప్రపంచకప్‌ ఫైనల్లో భారీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో రాణించిన వైభవ్‌.. భారత్‌ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్‌-2026లోనూ రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా దుమ్ములేపుతున్నాడు. పదమూడు మ్యాచ్‌లలో కలిపి 579 పరుగులు సాధించాడు. తద్వారా తన ప్రదర్శనలు గాలివాటం కాదని నిరూపించుకున్నాడు.

భారత్‌-‘ఎ’ జట్టులో చోటు
ఈ నేపథ్యంలో పదిహేనేళ్ల వైభవ్‌ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే, బీసీసీఐ మాత్రం తొలుత అతడిని భారత్‌-‘ఎ’ జట్టులో ఆడించాలని నిర్ణయించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే సిరీస్‌కు అతడిని ఎంపిక చేసింది. లంక, అఫ్గన్‌ ‘ఎ’ జట్లతో తలపడే ఈ జట్టుకు తిలక్‌ వర్మ కెప్టెన్‌.

రోహిత్‌కు గండం
ఇదిలా ఉంటే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 టోర్నీకి ఇప్పటి నుంచే ఓపెనింగ్‌ జోడీపై టీమిండియా యాజమాన్యం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఫిట్‌నెస్‌ కారణాల దృష్ట్యా టోర్నీ నుంచి తప్పించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ను ఆడిస్తూ.. బ్యాకప్‌ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇందుకు తగ్గట్లుగానే అఫ్గన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు ఇషాన్‌ ఎంపికయ్యాడు.

జైసూ ఎదురుచూపులు
ఇక రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌కు లోబడి.. ఈ సిరీస్‌లో ఆడతాడని బీసీసీఐ తెలిపింది. మరోవైపు.. అఫ్గన్‌తో ఏకైక టెస్టుకు ఎంపికైన యశస్వి జైస్వాల్‌ను వన్డేల నుంచి మాత్రం పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీకి సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది.

శ్రీలంకలో భారత్‌-‘ఎ’ జట్టు తరఫున గనుక నిలకడగా రాణిస్తే.. వన్డే వరల్డ్‌కప్‌-2027 నేపథ్యంలో వైభవ్‌ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారన్నది దాని సారాంశం. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు క్రిక్‌బ్లాగర్‌తో మాట్లాడుతూ..

ఫామ్‌ కొనసాగిస్తే వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో చోటు
‘‘వైభవ్‌ సూర్యవంశీ త్వరలోనే టీమిండియాకు ఆడబోతున్నాడు. భారత్‌-ఎ తరఫున అతడి ప్రదర్శనను బట్టి ఎంత త్వరగా జాతీయ జట్టులోకి వస్తాడన్నది తెలుస్తుంది. సెలక్టర్లు అతడి ఆట తీరును నిశితంగా గమనిస్తున్నారు. 

అతడు ఇలాగే నిలకడగా ఆడుతూ.. ఫామ్‌ కొనసాగిస్తే వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అతడికి ఆకాశమే హద్దు’’ అని పేర్కొన్నాయి. కాగా ఒకవేళ 15 ఏళ్ల వైభవ్‌ గనుక ఊహించని రీతిలో ఈ జట్టులోకి వస్తే నిజంగా అదొక సంచలనమే అవుతుంది.

చదవండి: ‘నేను పుట్టకముందు సచిన్‌ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’

Advertisement
 
Advertisement
Advertisement