‘నేను పుట్టకముందు సచిన్‌ అరంగేట్రం.. ఆ రికార్డు బ్రేక్‌ చేస్తా’ | Joe Root Breaks Silence Admits Chasing Sachin All Time Test Record | Sakshi
Sakshi News home page

‘నేను పుట్టకముందు సచిన్‌ అరంగేట్రం.. ఆ రికార్డు బద్దలు కొడతా’

May 23 2026 12:01 PM | Updated on May 23 2026 12:10 PM

Joe Root Breaks Silence Admits Chasing Sachin All Time Test Record

క్రికెట్‌లో అత్యంత కఠినమైనది టెస్టు ఫార్మాట్‌. సంప్రదాయ క్రికెట్‌లో రాణించాలనే ఆటగాళ్లకు టెక్నిక్‌తో పాటు ఓపిక, సహనం కూడా అవసరం. ఇక టెస్టుల్లో ఉన్నత శిఖరాలకు చేరుకున్న క్రికెటర్లలో భారత దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ అగ్రస్థానంలో ఉంటాడు.

సచిన్‌కు చేరువలో
దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు సాగిన తన సుదీర్ఘ కెరీర్‌లో సచిన్‌.. 329 ఇన్నింగ్స్‌లో కలిపి 15,921 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 51 శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం పరుగుల పరంగా సచిన్‌కు చేరువలో ఉన్న ఏకైక క్రికెటర్‌ జో రూట్‌. ఈ ఇంగ్లండ్‌ దిగ్గజం ఇప్పటికి 298 ఇన్నింగ్స్‌ ఆడి 13,943 పరుగులు సాధించాడు.

ఇక 35 ఏళ్ల రూట్‌ మరికొంతకాలం క్రికెట్‌లో కొనసాగనున్న నేపథ్యంలో.. సచిన్‌ రికార్డును బద్దలు కొట్టగలడన్న చర్చ చాన్నాళ్లుగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో రూట్‌ (Joe Root)కు ఈ విషయం గురించి తాజాగా మరోసారి ప్రశ్న ఎదురైంది.

మౌనం వీడిన రూట్‌
‘ది అథ్లెటిక్‌’తో మాట్లాడుతూ.. ‘‘ఈ ప్రశ్న నన్ను చాలా మంది చాలా సార్లే అడిగారు. అయితే, ఈసారి ఇందుకు సమాధానం చెప్పాలనుకుంటున్నాను. కచ్చితంగా నా వంతు ప్రయత్నం ఉంటుందని మాత్రం చెప్పగలను.

నేను పుట్టకముందే సచిన్‌ అరంగేట్రం
సచిన్‌ టెండుల్కర్‌ గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిందేమీ లేదు. ఆయన సాధించిన ఘనతలు అమోఘం. నేను పుట్టకముందే సచిన్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. నా టెస్టు అరంగేట్రం తర్వాత కూడా అతడి కెరీర్‌ కొనసాగింది.

తప్పక ప్రయత్నిస్తా
సుదీర్ఘ కెరీర్‌లో టెస్టుల్లో టన్నుల కొద్దీ పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. వన్డేల్లోనూ సచిన్‌ 49 శతకాలు సాధించాడు’’ అని 52 ఏళ్ల సచిన్‌పై రూట్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. 

సచిన్‌ రికార్డు బద్దలు కొట్టేందుకు తాను తప్పక ప్రయత్నిస్తానని.. అయితే, ఇందుకోసం తన బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరచుకోవాల్సి ఉంటుందిన రూట్‌ పేర్కొన్నాడు.

‘‘నా టెక్నిక్‌ మరింత మెరుగుపడాలి. వ్యూహాత్మకంగా నేను ముందడుగు వేయాలి. అయితే, క్రీజులో ఉన్నపుడు ఎంత జాగ్రత్తపడినా ఒక్కోసారి మూల్యం చెల్లించకతప్పదు. కాబట్టి మరింత గొప్పగా మ్యాచ్‌ కోసం సన్నద్ధం కావాల్సి ఉంటుంది’’ అని రూట్‌ చెప్పుకొచ్చాడు. 

కాగా 2021 నుంచి రూట్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతడు 24 టెస్టు సెంచరీల సాయంతో 6 వేలకు పైగా పరుగుల రాబట్టడం ఇందుకు నిదర్శనం.  

చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్‌

Advertisement
 
Advertisement
Advertisement