టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టీ20 మ్యాచ్‌లకు సిద్ధమైంది. అక్టోబరు 29- నవంబరు 8 వరకు ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో భారత జట్టును పరిశీలిస్తే ఇందులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం గల ఆటగాళ్లు ఉన్నారు.
మరి లెఫ్టాండర్ల వల్ల జట్టుకు అదనపు ప్రయోజనాలు ఏమైనా ఉంటాయా? వీరిని ఎక్కువగా తుదిజట్టులోకి తీసుకోవడం వల్లే కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం!
బ్రియన్ లారా మారథాన్ ఇన్నింగ్స్ నుంచి ఆడం గిల్‌క్రిస్ట్ విధ్వంసకర ఇన్నింగ్స్, సౌరవ్ గంగూలీ మెరుపులు .. ఎడమచేతి వాటం బ్యాటర్ల అద్భుత ప్రదర్శనలకు ఇవి నిదర్శనాలు.
అడ్వాంటేజ్ ఏంటి?
క్రికెట్‌లో కుడిచేతి వాటం బ్యాటర్లే ఎక్కువ. కాబట్టి బౌలర్లు కూడా అందుకు తగ్గట్లుగానే శిక్షణలో ఎక్కువగా రైట్ హ్యాండ్ బ్యాటర్లకే బౌల్ చేస్తూ ఉంటారు. కాబట్టి లెఫ్టాండర్లు బరిలో ఉన్నపుడు వారి లైన్ అండ్ లెంగ్త్ మార్చుకోవాల్సి ఉంటుంది.
ఒకవేళ క్రీజులో లెఫ్ట్- రైట్ బ్యాటర్లు జోడీగా ఉన్నారంటే బౌలర్లకు వారిని విడదీయడం మరింత కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ ఇద్దరూ దంచికొడుతున్నారంటే.. బౌలర్ల రిథమ్ దెబ్బ తింటుంది. ఫీల్డింగ్‌లోనూ మార్పులు చేయడం బౌలింగ్ చేస్తున్న కెప్టెన్‌కు తలనొప్పిగా మారుతుంది. తరచూ ఫీల్డర్లను మార్చడం కూడా మైనస్‌గా మారుతుంది.
డేటా ఏం చెబుతోంది?
తమ రైట్ హ్యాండ్ కౌంటర్‌పార్ట్స్ కంటే లెఫ్టాండర్లు మూడు ఫార్మాట్లలోనూ రాణించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో లెఫ్టాండర్లు విండీస్ లెజెండ్ బ్రియన్ లారా, శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర వేల కొద్దీ పరుగులు రాబట్టారు. సంగక్కర టెస్టుల్లో 12,400 పరుగులు సాధిస్తే.. లారా 11,953 పరుగులు స్కోరు చేశాడు.
ఇక వన్డేల్లో సౌరవ్ గంగూలీ, శిఖర్ ధావన్ టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు కనబరిచారు. గంగూలీ 311 వన్డేల్లో 11363 పరుగులు స్కోరు చేస్తే.. 167 వన్డేలు ఆడి 6793 రన్స్ రాబట్టాడు.
అదే విధంగా టీ20 ఫార్మాట్లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించగా.. ప్రస్తుతం టీమిండియాలో ఉన్న అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే.
మ్యాచ్ స్వరూపాన్ని మలుపు తిప్పగలరు!
లెఫ్టాండ్ బ్యాటర్లు ఆఫ్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరు. స్పిన్నర్ల బౌలింగ్‌లో వీరికి షాట్ సెలక్షన్ సులభంగా ఉంటుంది.
పవర్ ప్లే, డెత్ ఓవర్లలోనూ వీరి సంప్రదాయ విరుద్ధ బ్యాటింగ్ కారణంగా ప్రత్యర్థి బౌలర్లు, ఫీల్డర్లను మార్పు చేసే క్రమంలో గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి కీలక సమయాల్లో వ్యూహాలు మార్చుకోవాల్సి రావడం విజయావకాశాలను దెబ్బ తీస్తుంది.
సైకలాజికల్ ఎడ్జ్
కుడిచేతి వాటం బౌలర్లు లెఫ్టాండర్ బ్యాటర్లను ఎదుర్కొనేటపుడు సవాళ్లు ఎదుర్కొంటారు. ప్రతిసారి లైన్ అండ్ లెంగ్త్ మార్చడం వారికి కఠినతరంగా మారుతుంది. ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లను తరచూ మార్చాల్సి రావడం వల్ల బ్యాటర్లకు పరుగులు స్కోరు చేసే అవకాశాలు పెరుగుతాయి.
లెజెండరీ లెఫ్టాండ్ బ్యాటర్లు
బ్రియన్ లారా టెస్టుల్లో క్వాడ్రపుల్ (400*) సెంచరీ చేసి ఇప్పటికీ తన పేరిటే ఆ రికార్డును పదిలం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ వన్డే, టెస్టుల్లో తనదైన ముద్ర వేశాడు. ఇక క్రిస్ గేల్, యువరాజ్ సింగ్‌ల గురించి త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా లెఫ్టాండ్ బ్యాటరే. ఇప్పటికే యూత్ వన్డే, యూత్ టెస్టులలో వైభవ్ ఇరగదీస్తున్నాడు.
భారత ప్రస్తుత టీ20 జట్టులో ఎనిమిది మంది
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రస్తుత భారత టీ20 జట్టులో ఏకంగా ఎనిమిది మంది ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉన్నారు. టాపార్డర్‌లో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ.. వన్‌డౌన్‌లో తిలక్‌వర్మ అందుబాటులో ఉన్నారు. వీరిద్దరు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలరు.
ఇక పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ శివం దూబేతో పాటు నయా ఫినిషర్ రింకూ సింగ్ కూడా లెఫ్టాండరే. వీరితో పాటు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా ఎడమచేతి వాటం గల ప్లేయర్లే. స్పిన్ కోటాలో కుల్దీప్ యాదవ్, పేసర్ల కోటాలో అర్ష్‌దీప్ సింగ్ లెఫ్టాండర్ల జాబితాలో ఉన్నారు.
చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్‌డేట్ ఇచ్చిన సూర్య


