భారత వన్డే క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి (Shreyas Iyer Health Update)పై టీ20 సారథి సూర్యకుమార్ యాదవ్ కీలక అప్‌డేట్ అందించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందంటూ అభిమానులకు శుభవార్త చెప్పాడు. వైద్యులు నిరంతరం శ్రేయస్‌ను కనిపెట్టుకుని ఉండి.. ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షిస్తున్నారని సూర్య తెలిపాడు.
కాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా శ్రేయస్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. హర్షిత్ రాణా (Harshit Rana) బౌలింగ్‌లో అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను సంచలన రీతిలో అందుకున్న ఈ ముంబై బ్యాటర్.. వెంటనే కిందపడిపోయాడు. పొట్ట పట్టుకుని నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి అతడిని డ్రెసింగ్‌రూమ్‌కు తీసుకువెళ్లాడు.
స్పృహ తప్పి పడిపోయాడు
ఆ తర్వాత గాయం తీవ్రత ఎక్కువ కావడంతో వెంటనే సిడ్నీలోని ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘అయ్యర్ డ్రెసింగ్‌రూమ్‌కు వెళ్లగానే స్పృహ తప్పి పడిపోయాడు.
ప్రాణాంతకమైన గాయమే
ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, ఫిజియో, టీమ్ డాక్టర్ వెంటనే స్పందించి పరిస్థితి చేయి దాటకుండా చూసుకున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నా.. ప్రాణాంతకమైన గాయమే అది. శ్రేయస్ పట్టుదల గల ఆటగాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెడతాడు’’ అని పేర్కొన్నాయి.
ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆరంభానికి ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు శ్రేయస్ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘శ్రేయస్ గాయపడ్డాడని తెలిసిన వెంటనే నేను అతడికి కాల్ చేశాను.
నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నా
అయితే, అప్పుడు తన ఫోన్ తన దగ్గర లేదని తెలిసింది. వెంటనే ఫిజియో కమలేశ్ జైన్‌కు ఫోన్ చేశా. పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. ఇక గత రెండురోజులుగా నేను అయ్యర్‌తో మాట్లాడుతున్నా. దీనర్థం.. అతడు బాగానే ఉన్నట్లు కదా!
అవును.. శ్రేయస్ పరిస్థితి మెరుగుపడుతోంది. వైద్యులు నిరంతరం అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరికొన్న రోజుల పాటు అయ్యర్ వారి పర్యవేక్షణలోనే ఉండనున్నాడు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అంటూ శ్రేయస్ గురించి ఆందోళన చెందుతున్న అభిమానులకు సూర్య ఊరట కలిగించాడు.
కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన టీమిండియా వన్డే సిరీస్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో మార్ష్ బృందం.. గిల్ సేనను 2-1తో ఓడించి సిరీస్ గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య బుధవారం (అక్టోబరు 29) నుంచి టీ20 సిరీస్ మొదలుకానుంది. నవంబరు 8న ఐదో టీ20తో సిరీస్ ముగుస్తుంది.
చదవండి: యశస్వి జైస్వాల్ కీలక నిర్ణయం


