భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్‌మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్‌మెంట్‌కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు.
జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్‌కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.
ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్‌లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్‌మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్‌కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.
జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.
టీమిండియా తరఫున కమిట్‌మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్‌కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.
జైస్వాల్ గత సీజన్‌లో జమ్మూ అండ్ కాశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను ఈ ఏడాది ఆగస్ట్‌లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.
రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్‌కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్‌కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్‌లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్‌కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్‌లు నవంబర్ 14 (కోల్‌కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.
చదవండి: వెస్టిండీస్ బోణీ


