
న్యూజిలాండ్ జట్టు పసికూన జింబాబ్వేపై తమ ప్రతాపాన్ని చూపించింది. బులవాయో వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. మ్యాట్ హెన్రీ (15.3-3-39-6), నాథన్ స్మిత్ (14-8-20-3) ధాటికి 149 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (39) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (88), డారిల్ మిచెల్ (80) రాణించడంతో 307 పరుగులు చేసింది. బ్లెస్సింగ్ ముజరబానీ 3 వికెట్లతో రాణించాడు.
158 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఈ ఇన్నింగ్స్‌లో కూడా చేతులెత్తేసింది. మిచెల్ సాంట్నర్ (17.1-6-27-4), మ్యాట్ హెన్రీ (21-5-51-3), విలియమ్ ఓరూర్కీ (10-4-28-3) ధాటికి 165 పరుగులకే ఆలౌటైంది. జింబాబ్వే సెకెండ్ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసిన సీన్ విలియమ్స్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
అనంతరం 8 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 2.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్ ఆగస్ట్ 7 నుంచి ప్రారంభం కానుంది.