పంజాబ్ కింగ్స్ మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ ఆస్ట్రేలియాకు గుడ్‌బై చెప్పి తన సొంత దేశమైన పోర్చుగల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఫిన్‌లాండ్ వేదికగా జరుగుతున్న 'ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ యూరోప్ క్వాలిఫైయర్ C' టోర్నీలో పోర్చ్‌గల్ తరపున అద్భుతమైన ప్రదర్శనలతో హెన్రిక్స్ దూసుకుపోతున్నాడు.
అరంగేట్ర మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌పై మెరుపు అర్ధ శతకంతో విరుచుకుపడ్డ హెన్రిక్స్.. తాజాగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిపోయాడు. పోర్చుగల్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హెన్రిక్స్.. కేవలం 51 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.
టీ20 క్రికెట్‌లో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం గమనార్హం. మోయిసెస్ విధ్వంసకర ఇన్నింగ్స్ దెబ్బకి పోర్చుగల్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం భారీ లక్ష్య చేధనలో చెక్ రిపబ్లిక్ పూర్తిగా తేలిపోయిది. 8.5 ఓవర్లలో 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ సమయంలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. అయితే వర్షం ఎప్పటికి తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం.. పోర్చుగల్‌ను విజేతగా నిర్ణయించారు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హెన్రిక్స్.. టీ20 ప్రపంచకప్-2028కు పోర్చుగల్ జట్టును అర్హత సాధించేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పుకొచ్చాడు.
చదవండి: 'జడేజా పని అయిపోయింది.. దయచేసి అతడితో పోల్చొద్దు'


