
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఇచ్చే ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పురస్కారానికి అతడు నామినేట్ అయ్యాడు. కాగా ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు.. ఆన్‌లైన్‌లో అభిమానులు వేసిన ఓట్ల ఆధారంగా ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు విజేతను నిర్ణయిస్తారు.
ఇక ఆగష్టు 2025 నెలకు గానూ నామినేట్ అయిన పురుష క్రికెటర్ల పేర్లను ఐసీసీ సోమవారం వెల్లడించింది. ఇందులో ఈసారి ముగ్గురూ బౌలర్లే ఉండటం విశేషం. టీమిండియా నుంచి సిరాజ్, న్యూజిలాండ్ జట్టుకు చెందిన మ్యాట్ హెన్రీ (Matt Henry), వెస్టిండీస్ పేసర్ జేడన్ సీల్స్ (Jayden Seals) ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు.
ఆగష్టు నెలలో ఒకే ఒక్క మ్యాచ్
కాగా ఈ ఏడాది ఆగష్టు నెలలో సిరాజ్ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా.. ఇంగ్లండ్‌తో జూలై 31- ఆగష్టు 4 వరకు ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టులో... ఈ హైదరాబాదీ పేసర్ చివరగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఆఖరి రోజు.. చివరి సెషన్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో సిరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇంగ్లండ్ చేతిలో ఆరు వికెట్లు ఉండి విజయానికి కేవలం 73 పరుగుల దూరంలో ఉన్న వేళ ఈ రైటార్మ్ పేసర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలీ (14), ఓలీ పోప్ (27), జేమీ స్మిత్ (2), జేమీ ఓవర్టన్ (9) రూపంలో కీలక వికెట్లు కూల్చి సిరాజ్ మియా.. ఆఖరి వికెట్‌గా గస్ అట్కిన్సన్ (17)ను వెనక్కి పంపాడు.
సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర
ఇలా వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. విజయానికి కేవలం ఆరు పరుగుల దూరంలో నిలిచేలా చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు కూల్చి.. టీమిండియా సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే ఆగష్టు నెలకుగానూ ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
అదరగొట్టిన హెన్రీ, జేడన్ సీల్స్
మరోవైపు.. జింబాబ్వేతో టెస్టు సిరీస్‌లో కివీస్ పేసర్ మ్యాట్ హెన్రీ గొప్పగా రాణించాడు. రెండు మ్యాచ్‌లలో కలిపి 16 వికెట్లు కూల్చి.. న్యూజిలాండ్ సిరీస్‌ను 2-0తో వైట్‌వాష్ చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు.
ఇక పాకిస్తాన్‌పై 34 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెస్టిండీస్ వన్డే సిరీస్ గెలవడంలో జేడన్ సీల్స్ పాత్ర కీలకం. ఆఖరి వన్డేలో ఏకంగా ఆరు వికెట్లు కూల్చి.. పాక్‌పై విండీస్ 202 పరుగుల భారీ తేడాతో గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. మొత్తంగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో కేవలం 4.10 ఎకానమీ రేటుతో సీల్స్ పది వికెట్లు కూల్చడం గమనార్హం.
చదవండి: ఆసియా కప్-2025: పూర్తి షెడ్యూల్, అన్ని జట్లు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు