తరుణ్‌ శుభారంభం | Mixed results for Indian players in mens singles at US Open | Sakshi
Sakshi News home page

తరుణ్‌ శుభారంభం

Jun 27 2025 4:19 AM | Updated on Jun 27 2025 4:19 AM

Mixed results for Indian players in mens singles at US Open

ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశం 

శ్రీకాంత్, ప్రియాన్షులకు షాక్‌ 

యూఎస్‌ ఓపెన్‌ టోర్నీ  

అయోవా (అమెరికా): యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తెలంగాణ ప్లేయర్, ప్రపంచ 54వ ర్యాంకర్‌ తరుణ్‌ మన్నేపల్లి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్, ప్రపంచ 37వ ర్యాంకర్‌ ప్రియాన్షు రజావత్, ప్రపంచ 57వ ర్యాంకర్‌ శంకర్‌ ముత్తుస్వామి సుబ్రమణియన్, ప్రపంచ 61వ ర్యాంకర్‌ రిత్విక్‌ సంజీవి సతీశ్‌ కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. తొలి రౌండ్‌లో తరుణ్‌ 19–21, 21–18, 21–18తో ప్రపంచ 53వ ర్యాంకర్‌ అర్నాడ్‌ మెర్‌క్లే (ఫ్రాన్స్‌)పై గెలుపొందాడు. 

70 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ పోరులో కీలకదశలో తరుణ్‌ పాయింట్లు గెలిచి విజయాన్ని అందుకున్నాడు. తొలి గేమ్‌ను కోల్పోయిన తరుణ్‌... రెండో గేమ్‌లో స్కోరు 18–18 వద్ద వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 14–16తో వెనుకబడిన దశలో తరుణ్‌ విజృంభించి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు చేజార్చుకున్న తరుణ్‌ వెంటనే తేరుకొని మరో రెండు పాయింట్లు నెగ్గి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత్‌కే చెందిన ఆయుశ్‌ శెట్టితో తరుణ్‌ తలపడతాడు. ఈ సీజన్‌లో తరుణ్‌ ఏడు టోర్నీల్లో ఆడి రెండింటిలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. మరోవైపు ప్రపంచ 50వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 19–21, 21–12, 14–21తో ప్రపంచ 77వ ర్యాంకర్‌ హ్యారీ హువాంగ్‌ (ఇంగ్లండ్‌) చేతిలో, ప్రియాన్షు 10–21, 21–12, 7–21తో 106వ ర్యాంకర్‌ టింగ్‌ యెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో, శంకర్‌ 13–21, 19–21తో లియావో జు ఫు (చైనీస్‌ తైపీ) చేతిలో, రిత్విక్‌ 18–21, 12–21తో ఎనోగట్‌ రాయ్‌ (ఫ్రాన్స్‌) చేతిలో ఓడిపోయారు.  

శ్రియాన్షికి నిరాశ 
మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ క్రీడాకారిణి శ్రియాన్షి వలిశెట్టి, తాన్యా హేమంత్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా... భారత్‌కే చెందిన అన్‌మోల్‌ ఖరబ్, ఆకర్షి కశ్యప్, తన్వీ శర్మ, ఐరా శర్మ తొలి రౌండ్‌లో విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు. శ్రియాన్షి 16–21, 21–23తో ఏడో సీడ్‌ పొలీనా బురోవా (ఉక్రెయిన్‌) చేతిలో, తాన్యా 21–10, 22–24, 16–21తో అమేలీ షుల్జ్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓటమి పాలయ్యారు. అన్‌మోల్‌ 16–21, 21–13, 21–19తో తెరెజా స్విబికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, ఆకర్షి 21–19, 21–10తో లియాంగ్‌ టింగ్‌ యు (చైనీస్‌ తైపీ)పై, తన్వీ శర్మ 21–19, 21–9తో రెండో సీడ్‌ ఎన్గుయెన్‌ థుయ్‌ లిన్‌ (వియత్నాం)పై గెలిచారు. 

హుంగ్‌ యిటింగ్‌ (చైనీస్‌ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ఐరా శర్మ తొలి గేమ్‌ను 12–21తో కోల్పోయి, రెండో గేమ్‌ను 21–16తో సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో స్కోరు 6–6తో సమంగా ఉన్నపుడు హుంగ్‌ యిటింగ్‌ గాయం కారణంగా మాŠయ్‌చ్‌ నుంచి వైదొలిగింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో టాప్‌ సీడ్‌ తనీషా క్రాస్టో–ధ్రువ్‌ కపిల (భారత్‌) ద్వయం 21–17, 16–21, 17–21తో లిన్‌ యు చియె–హుంగ్‌ యుఎన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడిపోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement