భారత్‌కు మిశ్రమ ఫలితాలు | Mixed results for India in Thomas Cup and Uber Cup team badminton tournaments | Sakshi
Sakshi News home page

భారత్‌కు మిశ్రమ ఫలితాలు

Apr 25 2026 3:14 AM | Updated on Apr 25 2026 3:14 AM

Mixed results for India in Thomas Cup and Uber Cup team badminton tournaments

పురుషుల జట్టు గెలుపు 

మహిళల జట్టు ఓటమి  

హోర్‌సెన్స్‌ (డెన్మార్క్‌): ప్రతిష్టాత్మక థామస్‌ కప్, ఉబెర్‌ కప్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. థామస్‌ కప్‌లో భారత పురుషుల జట్టు గెలుపు బోణీ కొట్టగా... ఉబెర్‌ కప్‌లో భారత మహిళల జట్టు ఓడిపోయింది. కెనడాతో జరిగిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు 4–1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రపంచ 11వ ర్యాంకర్, భారత నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ 21–18, 19–21, 10–21తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ విక్టర్‌ లాయ్‌ చేతిలో ఓడిపోయాడు. 

అయితే రెండో మ్యాచ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 21–10, 21–11తో జొనాథన్‌ బింగ్‌–కెవిన్‌ లీ జంటను ఓడించి స్కోరును 1–1తో సమం చేసింది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌ రన్నరప్‌ ఆయుశ్‌ శెట్టి 21–13, 21–17తో బ్రియాన్‌ యాంగ్‌పై గెలిచి భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు.

నాలుగో మ్యాచ్‌లో హరిహరన్‌–ఎంఆర్‌ అర్జున్‌ ద్వయం 21–7, 21–15తో లిండెమన్‌–నిల్‌ యకూరా జోడీని ఓడించి భారత్‌కు 3–1తో విజయాన్ని ఖరారు చేసింది. ఐదో మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–17, 21–12తో జోషువా నుగుయెన్‌పై నెగ్గడంతో భారత్‌ 4–1తో ముగించింది. సోమవారం జరిగే రెండో లీగ్‌ మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో భారత్‌ ఆడుతుంది.  

సింధు గెలిచినా.... 
మరోవైపు భారత మహిళల జట్టు గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో 2–3తో ఆతిథ్య డెన్మార్క్‌ చేతిలో ఓటమి పాలైంది. తొలి మ్యాచ్‌లో పీవీ సింధు 21–13, 18–21, 21–17తో లినె క్రిస్టోఫర్సన్‌ను ఓడించింది. రెండో మ్యాచ్‌లో ఉన్నతి హుడా 12–21, 23–25తో లినె జార్స్‌ఫెల్ట్‌ చేతిలో ఓడిపోయింది. మూడో మ్యాచ్‌లో ప్రియ–శ్రుతి మిశ్రా జోడీ 17–21, 21–11, 21–23తో అమెలియా–మెటీ వెర్జ్‌ జంట చేతిలో పరాజయం పాలైంది. 

నాలుగో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–19, 16–21, 16–21తో అమెలియా షుల్జ్‌ చేతిలో ఓటమి చెందడంతో భారత్‌ పరాజయం ఖరారైంది. నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో సింధు–తనీషా క్రాస్టో ద్వయం తొలి గేమ్‌ను 19–21తో కోల్పోయి రెండో గేమ్‌లో 17–14తో ఆధిక్యంలో ఉన్న దశలో అలెగ్జాండ్రా బొయె–క్రిస్టీన్‌ బుష్‌ జోడీ గాయంతో వైదొలిగింది. నేడు జరిగే రెండో మ్యాచ్‌లో ఉక్రెయిన్‌తో భారత్‌ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement