
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఐడైన్ మార్‌క్రమ్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్‌గా మార్‌క్రమ్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మాకర్‌క్రమ్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు ప్రోటీస్ ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ పేరిట ఉండేది. మోరిస్ 2016లో జోహన్స్ బర్గ్ వేదికగా ఇంగ్లీష్ జట్టుతో జరిగిన వన్డేలో 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో మోరిస్ ఆల్‌టైమ్ రికార్డును ఐడైన్ బ్రేక్ చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వీరిద్దరి తర్వాత స్ధానంలో మిల్లర్(33 బంతులు) ఉన్నాడు.
మార్‌క్రమ్ విధ్వంసం..
కాగా 132 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో మార్‌క్రమ్ విధ్వంసం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మార్‌క్రమ్.. 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86 పరుగులు చేశాడు. అతడితో పాటు మరో ఓపెనర్ రికెల్టన్(31) రాణించాడు.
దీంతో టార్గెట్‌ను సౌతాఫ్రికా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 20.5 ఓవర్లలో చేధించింది. ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 24.3 ఓవర్లలో కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా బౌలర్లలో స్పిన్నర్ కేశవ్ మహారాజ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ముల్డర్ 3 వికెట్లు సాధించాడు.
చదవండి: ENG vs SA: చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్..