
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత... ‘డబుల్ ఒలింపియన్’ భారత స్టార్ మనోజ్ కుమార్ బాక్సింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. త్వరలో కోచ్ రూపంలో ముందుకు వస్తానని హరియాణాకు చెందిన 39 ఏళ్ల మనోజ్ గురువారం ప్రకటించాడు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం (64 కేజీలు) గెలిచిన మనోజ్... 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం (69 కేజీలు) సాధించాడు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో, 2016 రియో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ మనోజ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. 2007, 2013 ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు నెగ్గిన మనోజ్ 2016 దక్షిణాసియా క్రీడల్లో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.