
మాంచెస్టర్ టెస్ట్‌లో వీరోచితంగా పోరాడి ఇంగ్లండ్ గెలుపును అడ్డుకున్న టీమిండియా హీరోలు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. అభిమానులు, విశ్లేషకులు, వారు, వీరు అన్న తేడా లేకుండా అందరూ పై నలుగురిని కొనియాడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ (0), సాయి సుదర్శన్ (0) వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103) న భూతో న భవిష్యతి అన్న రీతిలో బ్యాటింగ్ చేసి మూడో వికెట్‌కు రికార్డు స్థాయిలో 188 పరుగులు జోడించారు. ఆతర్వాత వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) వీరోచిత శతకాలు బాది మ్యాచ్‌ను డ్రా చేశారు.
పై నలుగురిలో గిల్, జడ్డూ, సుందర్ సెంచరీలు చేయగా.. రాహుల్ తృటిలో ఆ మార్కును చేజార్చుకున్నాడు. స్టోక్స్ అద్బుతమైన బంతితో వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో రాహుల్ మూడంకెల స్కోర్‌ను చేరుకోలేకపోయాడు. రాహుల్ సెంచరీ చేయకపోయినా, చారిత్రక ఇన్నింగ్స్ ఆడి, ఇంగ్లండ్ గెలుపును అడ్డుకునేందుకు తొలి మెట్టు పేర్చాడు.
అంకెల విషయాన్ని పక్కన పెడితే సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో గిల్‌తో పాటు రాహుల్ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోతుంది. మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడన్న విషయం తప్పించి, సెంచరీలు చేసిన గిల్, జడ్డూ, సుందర్‌తో పాటు రాహల్‌ను కూడా వేనోళ్ల పొగడాల్సిందే.
The men who made it happen 🫡 pic.twitter.com/6zST20o0Dp
— Lucknow Super Giants (@LucknowIPL) July 28, 2025
ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో రాహుల్ మాజీ ఫ్రాంచైజీ అయిన లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం అతని ఇన్నింగ్స్‌ను విస్మరించి, మిగతా ముగ్గురికి క్రెడిట్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఇవాళ (జులై 28) ఉదయం ఎల్‌ఎస్‌జీ తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలను నుంచి పోస్ట్ చేస్తూ.. The men who made it happen అంటూ గిల్, జడ్డూ, సుందర్‌కు మాత్రమే క్రెడిట్ ఇచ్చింది.
ఇందులో రాహుల్ ప్రస్తావన లేకపోవడాన్ని క్రికెట్ అభిమానులు తప్పుబడుతున్నారు. రాహుల్ అంటే ఎందుకంత చిన్న చూపు అంటూ ఎల్‌ఎస్‌జీకి అక్షింతలు వేస్తున్నారు. ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా మ్యాచ్ భారత్ నుంచి చేజారకుండా ఉండటంలో రాహుల్‌ది కూడా ప్రధానపాత్ర అని అతని అభిమానులు అంటున్నారు.
కాగా, ఎల్‌ఎస్‌జీ యాజమాన్యానికి రాహుల్ విషయంలో ఇలా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. రాహుల్ తమ ఫ్రాంచైజీని వదిలి ఢిల్లీకి వెళ్లాడన్న అక్కసుతో వీలు చిక్కినప్పుడల్లా ఇలాగే ప్రవర్తిస్తుంటుంది.