
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు.. భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బ్యాటర్లు అద్బుతం చేశారు. తమ విరోచిత పోరాటంతో మ్యాచ్‌ను డ్రా ముగించి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.
ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా ముగించడంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లది కీలక పాత్ర. ఆఖరి రోజు ఆటలో కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్ ఔటైన తర్వాత ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.
ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ తమ సెంచరీల మార్క్‌ను అందుకున్నారు. ఇద్దరూ కలసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఎడమ చేతి వాటం జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.
ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో టెస్టుల్లో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా సుందర్- జడేజా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్ పేరిట ఉండేది.
ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు 1990లో మాంచెస్టర్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో ఈ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ అయ్యింది. ఇక భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్‌లోని ఓవెల్ వేదికగా జరగనుంది.
చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్