
జులై 31 నుంచి లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా టీమిండియాతో జరుగబోయే ఐదో టెస్ట్ కోసం అప్‌డేటెడ్ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) ఇవాళ (జులై 28) ప్రకటించింది. ఈ మ్యాచ్ కోసం నాలుగో టెస్ట్ ఆడిన జట్టును యధాతథంగా కొనసాగించిన ఈసీబీ అదనంగా మరో ఫాస్ట్ బౌలర్‌ను జట్టులో చేర్చుకుంది. 31 ఏళ్ల జేమీ ఓవర్టన్ ఐదో టెస్ట్ కోసం జట్టులో భాగం కానున్నాడు.
నాలుగో టెస్ట్ సందర్భంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ అసౌకర్యంగా కనిపించడంతో అతనికి బ్యాకప్‌గా జేమీని ఎంపిక చేశారు. జేమీ చేరికతో జట్టులో పేసర్ల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.
జేమీ చివరిగా 2022లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అతనికి కెరీర్‌లో అదే ఏకైక టెస్ట్ మ్యాచ్. నాడు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జేమీ 97 పరుగులు (ఒకే ఇన్నింగ్స్‌లో) చేసి, 2 వికెట్లు తీశాడు. జేమీ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.
భారత్‌తో ఐదో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలే, లియామ్ డాసన్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓల్లీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్
కాగా, మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నిన్న ముగిసిన నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. 311 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ (నాలుగో రోజు).. ఖాతా తెరవకుండానే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఊహకందని రీతిలో పుంజుకుంది.
కేఎల్ రాహుల్ (90), శుభ్‌మన్ గిల్ (103), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), రవీంద్ర జడేజా (107 నాటౌట్) న భూతో న భవిష్యతి అన్న రీతితో బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేశారు. ముఖ్యంగా సుందర్-జడేజా జోడీ ప్రదర్శించిన పోరాటపటిమ చరిత్రలో నిలిచిపోనుంది.
ఈ మ్యాచ్ డ్రా కావడంతో సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిపత్యం 2-1తో కొనసాగుతుంది. ఈ సిరీస్‌లో ఒకటి, మూడు మ్యాచ్‌లు ఇంగ్లండ్ గెలువగా.. భారత్ రెండో మ్యాచ్‌లో విజయం సాధించింది.