భార్య అనుష్క శర్మతో కోహ్లి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో అభిమానులను అలరించాడు. పెర్త్, అడిలైడ్‌లో డకౌట్లతో నిరాశపరిచిన ఈ రన్‌మెషీన్.. సిడ్నీలో మాత్రం సత్తా చాటాడు. మొత్తంగా 81 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్ల సాయంతో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.
ఆఖరి ఆస్ట్రేలియా టూర్
ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్)తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 168 పరుగులు జోడించిన కోహ్లి.. విన్నింగ్ షాట్‌గా ఫోర్ బాది టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోహ్లి కెరీర్‌లో ఇదే ఆఖరి ఆస్ట్రేలియా టూర్ కానుంది. దీంతో అభిమానులతో పాటు కింగ్ కూడా ఉద్వేగానికి లోనయ్యాడు. ఎట్టకేలకు సిడ్నీలో మరోసారి తన విలువను చాటుకుని ఆసీస్ పర్యటనను ముగించాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి కోహ్లి పేరు వైరల్‌గా మారింది.
ఈసారి ఆటతో కాకుండా వ్యక్తిగత విషయంతో కోహ్లి వార్తల్లోకి ఎక్కాడు. కాగా ఈ క్రికెట్ సూపర్‌స్టార్ వన్8 కమ్యూన్ పేరిట రెస్టారెంట్ చైన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ముంబైలో 2022లో తొలి రెస్టారెంట్ తెరిచిన కోహ్లి.. జుహులోనూ ఓ బ్రాంచ్ పెట్టాడు.
ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్
బాలీవుడ్ లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్‌కు చెందిన ఐకానిక్ బంగ్లాలో కోహ్లి రెస్టారెంట్ నడుస్తోంది. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల ధరలు తాజాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
కిచిడీ రూ. 620.. అన్నం రూ. 318
జుహులోని వన్8 రెస్టారెంట్లో పావ్ భాజీ ధర రూ. 650. అదే విధంగా.. ఉడకబెట్టిన అన్నం ధర రూ. 318. సింగిల్ సర్వింగ్ ఫ్రైస్ ధర ఏకంగా రూ. 348. వీటి సంగతి ఇలా ఉంటే.. కిచిడీ, తందూరీ రోటీ, బేబీ నాన్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.
విరాట్ రెస్టారెంట్లో ఒక తందూరీ రోటీ ధర రూ. 118. ఇక కిచిడీ ధర ఏకంగా అక్షరాలా 620 రూపాయలు. కాగా వన్8 రెస్టారెంట్లో మొక్కల ఆధారిత వంటకాలతో పాటు మాంసం, సీ ఫుడ్ కూడా అందుబాటులో ఉంటాయి.
విరాట్ ఫేవరెట్స్
అంతేకాదు.. ‘విరాట్ ఫేవరెట్స్’ పేరిట ప్రత్యేక వంటకాలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి. టోఫు స్టీక్, మష్రూమ్ డంప్లింగ్స్ విత్ ట్రఫోల్ ఆయిల్, సూపర్‌ఫుడ్ సలాడ్ ఇక్కడి వెజిటేరియన్ స్పెషల్స్. ఇక పెంపుడు జంతువుల కోసం వన్8లో ఫుడ్ అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 518- 818 వరకు ఉంటుంది.
ఇక అభిమానులను ఆకర్షించేందుకు వన్8 కమ్యూన్ ఎంట్రన్స్‌లోనే కోహ్లి క్రికెట్ ప్రయాణాన్ని సూచించేలా ఫొటోలు ఉంటాయి. కోహ్లి జెర్సీ (నంబర్ 18)ని అక్కడి గోడపై వేలాడదీసి ఉంచారు. గ్లాస్ రూఫ్ ద్వారా సూర్యకాంతి పడుతూ ఉంటుంది.
‘‘చక్కటి, ఆహ్లాకరమైన పరిసరాలు ఉండటం అత్యంత ముఖ్యం. భోజన నాణ్యత ఎలాగూ బాగానే ఉంటుంది. ప్రతి వంటకాన్ని శ్రద్ధ పెట్టి తయారు చేస్తాం. కానీ అన్నింటికంటే ఆంబియన్స్ బాగుంటేనే ఎవరైనా ఇక్కడి వరకు వస్తారు’’.. ఆతిథ్య రంగంలో రాణిస్తున్న కోహ్లి తరచూ చెప్పే మాట ఇది!!
చదవండి: అతడు అద్భుతం.. అహంకారం వద్దు.. రోహిత్- గిల్ సూపర్: గంభీర్


