
తాజాగా ముగిసిన హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక పరుగులు చేసి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ విధ్వంసకర ఆటగాడు జోర్డన్ కాక్స్‌కు ఇంగ్లండ్ జాతీయ జట్టు నుంచి పిలుపందింది.
త్వరలో ఐర్లాండ్‌లో పర్యటించబోయే ఇంగ్లండ్ జట్టులో కాక్స్ యాడ్ చేయబడ్డాడు. ఈ పర్యటన కోసం 14 మంది సభ్యుల జట్టును ఇదివరకే ప్రకటించినా, హండ్రెడ్ లీగ్ ప్రదర్శనల కారణంగా కాక్స్‌ను 15వ ఆటగాడిగా జట్టులో యాడ్ చేశారు.
ఐర్లాండ్ పర్యటనలో ఇంగ్లండ్ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 17-21 మధ్యలో డబ్లిన్ వేదికగా జరుగనుంది.
కాక్స్ హండ్రెడ్ లీగ్-2025లో 300కు పైగా పరుగులు చేశాడు. ఈ టోర్నీలో కాక్స్ ప్రదర్శనల కారణంగా అతని జట్టు వరుసగా మూడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్‌లో 300కు పైగా పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కాక్స్ మాత్రమే.
24 ఏళ్ల కాక్స్ ఇదివరకే ఇంగ్లండ్ తరఫున పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. గతేడాది హోం సిరీస్‌లో అతను ఆస్ట్రేలియాపై టీ20 అరంగేట్రం చేసి రెండు టీ20లు ఆడాడు. అనంతరం కాక్స్ వెస్టిండీస్‌లో వన్డే అరంగేట్రం చేశాడు.
ఐర్లాండ్‌లో పర్యటించబోయే ఇంగ్లండ్ జట్టుకు జేకబ్ బేతెల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ పర్యటన కోసం ఇంగ్లండ్ సెలెక్టర్లు కెప్టెన్ బ్రూక్‌కు విశ్రాంతినిచ్చారు.
ఐర్లాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు..
జేకబ్ బేతెల్ (కెప్టెన్), విల్ జాక్స్, రెహాన్ అహ్మద్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోస్ బట్లర్, టామ్ బాంటన్, ఫిల్ సాల్ట్, జోర్డన్ కాక్స్, సోన్నీ బేకర్, టామ్ హార్ట్లీ, సాకిబ్ మహమూద్, లూక్ వుడ్, మ్యాట్ పాట్స్, ఆదిల్ రషీద్