ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ 11 సిక్స్‌ల‌తో విధ్వంసం | Jake Fraser-McGurk 11 sixes in 38-ball 88 as San Fancisco Unicorns win by 32 runs | Sakshi
Sakshi News home page

MLC: ఐపీఎల్‌లో అట్ట‌ర్ ప్లాప్‌.. క‌ట్ చేస్తే! అక్క‌డ 11 సిక్స్‌ల‌తో విధ్వంసం

Jun 15 2025 11:51 AM | Updated on Jun 15 2025 12:52 PM

 Jake Fraser-McGurk 11 sixes in 38-ball 88 as San Fancisco Unicorns win by 32 runs

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2025 సీజ‌న్‌లో శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆదివారం కాలిఫోర్నియా వేదిక‌గా లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 32 ప‌రుగుల తేడాతో శాన్ ఫ్రాన్సిస్కో గెలుపొందింది. 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్‌ 19.5 ఓవర్లలో 187 పరుగులకే ఆలౌటైంది.

శాన్ ఫ్రాన్సిస్కో  స్టార్‌ పేసర్లు బార్ట్‌లెట్‌, హ్యారీస్ రౌఫ్‌ తలా నాలుగు వికెట్లు పడగొట్టి నైట్‌రైడర్స్‌ను దెబ్బ తీశారు. నైట్‌రైడర్స్‌ బ్యాటర్లలో ఉన్ముక్త్‌ చంద్‌(53), మాథ్యూ ట్రంప్‌(41) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

మెక్‌గుర్క్ తుపాన్‌ ఇన్నింగ్స్‌..
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. యునికార్న్స్‌ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌ విధ్వంసం సృష్టించాడు. ఫస్ట్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన మెక్‌గర్క్‌ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. 

క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. మెక్‌గర్క్‌ కేవలం 38 బంతుల్లోనే 2 ఫోర్లు,11 సిక్స్‌లతో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఫిన్‌ అలెన్‌(52)హాఫ్‌ సెంచరీతో రాణించాడు. ఇక లాస్ ఏంజిల్స్ బౌలర్లలో వాన్ షాల్క్విక్ మూడు వికెట్లు పడగొట్టగా.. అలీఖాన్‌ రెండు, రస్సెల్‌, నరైన్‌ తలా వికెట్‌ సాధించారు.

ఐపీఎల్‌లో ఫెయిల్‌..
కాగా జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గర్క్‌ ఐపీఎల్‌-2025 సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున 6 మ్యాచ్‌లు ఆడిన మెక్‌గర్క్‌.. 9.17 సగటుతో కేవలం 55 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో మిగిలిన మ్యాచ్‌లకు అతడిని జట్టు నుంచి తప్పించారు.


 

 

Advertisement
 
Advertisement
Advertisement