గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో ఊచకోత | MLC 2025: Glenn Maxwell Smashed Blasting Century With 13 Sixes Against LAKR | Sakshi
Sakshi News home page

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో ఊచకోత

Jun 18 2025 9:18 AM | Updated on Jun 18 2025 12:28 PM

MLC 2025: Glenn Maxwell Smashed Blasting Century With 13 Sixes Against LAKR

ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చాన్నాళ్ల తర్వాత తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌ ఆడాడు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌-2025 ఎడిషన్‌లో వాషింగ్టన్‌ ఫ్రీడంకు ప్రాతినిథ్యం వహిస్తున్న అతను.. ఇవాళ (జూన్‌ 18) లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో (48 బంతుల్లో) విరుచకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్సీ రికార్డు స్థాయిలో 13 సిక్సర్లు బాదాడు. 

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (68/4) బరిలోకి దిగిన మ్యాక్సీ తొలుత నిదానంగా ఆడాడు. తొలి 15 బంతుల్లో కేవలం 11 పరుగులే చేశాడు. ఆతర్వాత మ్యాక్సీకి పూనకం వచ్చింది. 34 బంతుల్లో 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 95 పరుగులు చేశాడు. మొత్తంగా మ్యాక్సీ ఈ ఇన్నింగ్స్‌లో 49 బంతులు ఎదుర్కొని 13 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో అజేయమైన 106 పరుగులు చేశాడు. 

ఫలితంగా టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన అతని జట్టు (వాషింగ్టన్‌ ఫ్రీడం) నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్సీది వన్‌మ్యాన్‌ షో నడిచింది. అతను మినహా మిచెల్‌ ఓవెన్‌ ఒక్కడే (11 బంతుల్లో 32) కాస్త పర్వాలేదనిపించాడు. ఒబస్‌ పియెనార్‌ను (15 బంతుల్లో 11 నాటౌట్‌) మరో ఎండ్‌లో పెట్టుకొని మ్యాక్సీ తన విధ్వంసకాండను కొనసాగించాడు. 

వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో రచిన్‌ రవీంద్ర 8, ఆండ్రియస్‌ గౌస్‌ 12, మార్క్‌ చాప్‌మన్‌ 17, జాక్‌ ఎడ్వర్డ్స్‌ 11 పరుగులు చేశాడు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో కోర్నె డ్రై, తన్వీర్‌ సంఘా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేసన్‌ హోల్డర్‌ ఓ వికెట్‌ తీశాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్‌ ఘోర పతనం​ దిశగా సాగుతుంది. ఆ జట్టు తొలి ముగ్గురు బ్యాటర్లు (అలెక్స్‌ హేల్స్‌, సునీల్‌ నరైన్‌, ఉన్ముక్త్‌ చంద్‌) డకౌట్ అయ్యారు. ఆతర్వాత వచ్చిన రోవ్‌మన్‌ పావెల్‌ (4), మాథ్యూ ట్రంప్‌ (2) కూడా సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే టపా కట్టేశాడు. 

ఫలితంగా నైట్‌రైడర్స్‌ 10 ఓవర్ల తర్వాత 5 వికెట్లు నష్టపోయి 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. సైఫ్‌ బదార్‌ (32 నాటౌట్‌), జేసన్‌ హోల్డర్‌ (21 నాటౌట్‌) పోరాడుతున్నారు. వాషింగ్టన్‌ బౌలర్లలో జాక్‌ ఎడ్వర్డ్స్‌ 2, మిచెల్‌ ఓవెన్‌, మార్క్‌ అడైర్‌, సౌరభ్‌ నేత్రావల్కర్‌ తలో వికెట్‌ తీశారు.



 

Advertisement
 
Advertisement
Advertisement