
ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అయితే, భారత్ రెండో టెస్టుకు ఎంపిక చేసిన తుదిజట్టుపై విమర్శలు వస్తున్నాయి.
మూడు మార్పులు
బర్మింగ్‌హామ్‌లో బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. పనిభారాన్ని తగ్గించే నిమిత్తం ప్రధాన పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)కు విశ్రాంతినిచ్చిన యాజమాన్యం.. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన్, శార్దూల్ ఠాకూలను జట్టు నుంచి తప్పించింది.
వీరి స్థానాల్లో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy), స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep) తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఎడ్జ్‌బాస్టన్ పిచ్ స్పిన్‌కు కాస్త ఎక్కువగానే సహకరిస్తుందనే విశ్లేషణల నడుమ చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను టీమిండియా పక్కనపెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
విమర్శల వర్షం
అంతేకాదు.. బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత పటిష్టం చేసేందుకు ఆల్‌రౌండర్లు నితీశ్, వాషీలను తీసుకున్నామని.. ఆఖర్లో కుల్దీప్‌ను కూడా పక్కనపెట్టాల్సి వచ్చిందని కెప్టెన్ శుబ్‌మన్ గిల్ చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్లు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ టీమిండియా నాయకత్వ బృందంపై విమర్శలు గుప్పించారు.
ఎనిమిది రోజుల విరామం తర్వాత కూడా బుమ్రాకు విశ్రాంతినివ్వడాన్ని రవిశాస్త్రి తప్పుబడితే.. కుల్దీప్‌ను ఎలా పక్కనపెడతారంటూ గావస్కర్, గంగూలీ ఫైర్ అయ్యారు. కీలక మ్యాచ్‌లో తుదిజట్టు కూర్పు సరిగ్గా లేదంటూ విమర్శించారు.
ఇచ్చిపడేసిన యశస్వి జైస్వాల్
అయితే, బుధవారం నాటి తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క మాటతో ఈ విమర్శలను తిప్పికొట్టాడు. ఆట పూర్తైన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లేదు.. తుదిజట్టు ఎంపికలో మాకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు’’ అంటూ విమర్శకులకు ఇచ్చిపడేశాడు. తమ ప్రణాళికలకు అనుగుణంగానే మార్పులు చేసినట్లు చెప్పుకొచ్చాడు.
అదే విధంగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గురించి మాట్లాడుతూ.. ‘‘బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అతడు అద్బుతం. జట్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలో అతడికి స్పష్టమైన అవగాహన ఉంది. మేము అనుకున్న పని పూర్తి చేస్తాం’’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. బర్మింగ్‌హామ్ వేదికగా రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి 310 పరుగులు చేసింది. ఓపెనర్లలో కేఎల్ రాహుల్ (2) విఫలం కాగా.. యశస్వి జైస్వాల్ అద్భుత అర్ధ శతకం(87) సాధించాడు.
ఇక కరుణ్ నాయర్ (31) మరోసారి నిరాశపరచగా.. రిషభ్ పంత్ 25 పరుగులకే వెనుదిరిగాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్ గిల్ శతక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. రవీంద్ర జడేజా అతడికి అండగా నిలిచాడు. బుధవారం ఆట పూర్తయ్యేసరికి గిల్ 114, జడ్డూ 41 పరుగులతో అజేయంగా ఉన్నారు.