
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ నెల 14న దుబాయ్‌లో జరుగబోయే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై సుప్రీం కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలైంది. ఈ మ్యాచ్‌ను రద్దు చేయాలని ఉర్వశి జైన్ నేతృత్వంలో నలుగురు న్యాయ విద్యార్థులు ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్‌ను దాఖలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జాతీయ గౌరవానికి విరుద్ధమని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు. మ్యాచ్ నిర్వహణ అమరవీరుల కుటుంబాలకు బాధ కలిగించే చర్యగా అభిప్రాయపడ్డారు.
అయితే, ఈ పిటిషన్‌ను జస్టిస్ జె.కె.మహేశ్వరి, విజయ్ బిష్ణోయి నేతృత్వంలోని బెంచ్ విచారణకు తీసుకోలేదు. "ఇది కేవలం మ్యాచ్ మాత్రమే.. వదిలేయండి" అంటూ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌పై రాజకీయ, సామాజిక భావోద్వేగాలు ఉన్నప్పటికీ, సుప్రీం కోర్టు ఈ విషయాన్ని క్రీడా పరంగా మాత్రమే పరిగణించింది.
క్రికెట్‌ను జాతీయ ప్రయోజనాల కంటే పైగా చూడలేమన్న అభిప్రాయాలు ఉన్నా, ప్రస్తుత విధానాలు మరియు అంతర్జాతీయ ఒప్పందాలు కారణంగా మ్యాచ్‌ను కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకుంటే, అది భారత ఆటగాళ్ల కెరీర్‌లపై ప్రభావం చూపే ప్రమాదముంది.
బహుల దేశాలు పాల్గొనే టోర్నీల్లో టీమిండియా పాక్‌తో తలపడనున్నా, ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం ఆడదు. ఈ విషయాన్ని బీసీసీఐ ఇదివరకే స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో భారత్ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (సెప్టెంబర్ 10) యూఏఈతో జరిగిన మ్యాచ్‌ను టీమిండియా 27 బంతుల్లోనే ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (16 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) చెలరేగడంతో 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది.