
టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే వన్డే సిరీస్‌లో హిట్‌మ్యాన్ పాల్గొనడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి రోహిత్ స్వయంగా క్లూ ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో ట్రైనింగ్ మొదలుపెట్టిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
ఈ ఫోటోల్లో రోహిత్ ప్యాడింగ్ చేసుకుంటూ, స్ప్రింట్ చేస్తూ కనిపించాడు. రోహిత్ బరువు కూడా చాలా తగ్గినట్లు కనిపిస్తున్నాడు. పలు నివేదికల ప్రకారం హిట్‌మ్యాన్ ఇటీవలికాలంలో 8 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తుంది. తాజాగా బీసీసీఐ నిర్వహించిన యో-యో టెస్ట్‌లో అతను 19.4 స్కోర్ సాధించాడని సమాచారం. రోహిత్ ఫిట్‌నెస్‌పై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం ఖచ్చితంగా ఆస్ట్రేలియా పర్యటన కోసమేనన్న సంకేతాన్నిస్తుంది.
టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో కొనసాగుతానని స్పష్టంగా ప్రకటించినా.. రోహిత్ వన్డే భవితవ్యం అంత క్లారిటీగా లేదు. కొందరు రోహిత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు ఆడతాడని అంటుంటే, ఆస్ట్రేలియా పర్యటనే లాస్ట్ అని కొందరు, ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఆడడని ఇంకొందరు అంటున్నారు.
ఈ ప్రచారాల నేపథ్యంలో రోహిత్ ఫిట్‌గా కనిపిస్తూ ప్రాక్టీస్ మొదలుపెట్టడం, వన్డేల్లో కొనసాగాలనుకున్న అతని సంకల్పాన్ని సూచిస్తుంది. రోహిత్ రాక కోసం అతని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. హిట్‌మ్యాన్ చివరిగా ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జెర్సీలో కనిపించాడు.
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న మొదలవుతుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. తొలుత వన్డేలు, ఆతర్వాత టీ20 సిరీస్ జరుగనున్నాయి. అక్టోబర్ 19 (పెర్త్), 23 (అడిలైడ్), 25 (సిడ్నీ) తేదీల్లో వన్డేలు.. 29 (కాన్‌బెర్రా), 31 (మెల్‌బోర్న్), నవంబర్ 2 (హోబర్ట్), 6 (గోల్డ్ కోస్ట్), 8 (బ్రిస్బేన్) తేదీల్లో టీ20లు జరుగనున్నాయి.