
ఇంగ్లండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య ఇంగ్లండ్‌పై 14 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది.
ఈ మ్యాచ్‌కు ముందే సౌతాఫ్రికాకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్ పేసర్ లుంగి ఎంగిడి, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ గాయాల బారిన పడ్డారు. వీరిలో ఎంగిడి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరంగా కాగా.. కేశవ్ మహారాజ్ ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా దూరం కావచ్చు.
ఇంగ్లండ్ సిరీస్‌లో ఎంగిడికి ప్రత్యామ్నాయంగా నండ్రే బర్గర్‌ను ఎంపిక చేయగా.. మహారాజ్‌కు ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. మహారాజ్ గాయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడంతో క్రికెట్ సౌతాఫ్రికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెడికల్ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మహారాజ్ ఇటీవలికాలంలో సౌతాఫ్రికా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో మొదలు.. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్ వరకు అతని హవా కొనసాగింది. సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను ప్రారంభించే తరుణంలో (పాక్‌తో సిరీస్) మహారాజ్ గాయపడటం ఆ జట్టు విజయావకాశాలను తప్పక ప్రభావితం చేయవచ్చు.
సౌతాఫ్రికా 2 టెస్ట్‌లు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం అక్టోబర్ 12 నుంచి పాకిస్తాన్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మహారాజ్ పూర్తిగా దూరమవుతాడా లేక టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉండడా అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.
మహారాజ్ తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అతను 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. మహారాజ్ తొలి టీ20 ఆడకపోయినా సౌతాఫ్రికా ఆ మ్యాచ్‌లో గెలుపొందింది.