
టీమిండియా యువ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ యూఏఈతో నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన ఆసియా కప్ 2025 మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో తొలి బంతి నుంచే ఊచకోత మొదలుపెట్టిన అభిషేక్.. యూఏఈ బౌలర్లపై తారాస్థాయిలో విరుచుకుపడ్డాడు. హైదర్ అలీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన అభిషేక్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ సరసన చేరాడు.
ABHISHEK SHARMA - HIT THE FIRST BALL OF THE INNINGS FOR A SIX. 🤯 pic.twitter.com/4sWr6hOLl0
— Johns. (@CricCrazyJohns) September 10, 2025
రోహిత్ (2021లో ఇంగ్లండ్‌పై), జైస్వాల్ (2024లో జింబాబ్వేపై), సంజూ (2025లో ఇంగ్లండ్‌పై) కూడా గతంలో అభిషేక్ తరహాలనే ఇన్నింగ్స్ టీ20ల్లో తొలి బంతికే సిక్సర్ కొట్టారు.
భారీ విజయం
అభిషేక్ విధ్వంసం ధాటికి యూఏఈ నిర్దేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 4.3 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. బంతుల పరంగా టీ20ల్లో భారత్‌కు ఇదే భారీ విజయం.
మరో 93 బంతులు మిగిలుండగానే టీమిండియా లక్ష్యాన్ని ఊదేసింది. 2021లో స్కాట్లాండ్‌పై 81 బంతులు మిగిలుండగానే గెలుపొందడం దీనికి ముందున్న రికార్డు.
ఆసియా కప్ చరిత్రలోనూ బంతుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు ఆఫ్ఘనిస్తాన్ పేరిట ఉండేది. 2022 ఎడిషన్‌లో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకపై 59 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
27 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్
ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో ఘనత కూడా సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా లక్ష్య ఛేదన చేసిన రెండో జట్టుగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం 27 బంతుల్లోనే టార్గెట్‌ను ఊదేసింది. ఈ రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 2022 ప్రపంచకప్‌లో ఆ జట్టు ఒమన్‌పై కేవలం 19 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ.. కుల్దీప్ యాదవ్ (2.1-0-7-4), శివమ్ దూబే (2-0-4-3), వరుణ్ చక్రవర్తి (2-0-4-1), అక్షర్ పటేల్ (3-0-13-1), బుమ్రా (3-0-19-1) ధాటికి 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. యూఏఈ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు అలీషాన్ షరాఫు (22), ముహమ్మద్ వసీం (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. అభిషేక్, శుభ్‌మన్ గిల్ (9 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (2 బంతుల్లో 7 నాటౌట్; సిక్స్) ధాటికి 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఈ టోర్నీలో భారత్ సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో తలపడనుంది.