
టి20 క్రికెట్‌లో ఇటలీ సంచలనం
తొలిసారి ప్రపంచకప్ టోర్నీకి అర్హత
కనీస సౌకర్యాలు లేకున్నా నిలకడగా ఫలితాలు
జో బర్న్స్ సారథ్యంలో ముందుకు
ఫుట్‌బాల్‌కు పెట్టింది పేరైన ఇటలీలో ఇప్పుడు మరో క్రీడ ప్రేక్షకాదరణ పొందుతోంది. ‘ఫిఫా’ ప్రపంచకప్‌లో నాలుగుసార్లు (1934, 1938, 1982, 2006) చాంపియన్‌గా... మరో రెండుసార్లు (1970, 1994) రన్నరప్‌గా నిలిచిన ఇటలీ... ఇటీవలి కాలంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. 2018, 2022లో జరిగిన ‘ఫిఫా’ వరల్డ్‌కప్ టోర్నీకి అర్హత పొందలేకపోయిన ఆ జట్టు... వచ్చే ఏడాది జరగనున్న ఫుట్‌బాల్ విశ్వ సమరంలో బరిలోకి దిగడం కూడా అనుమానంగా మారింది.
ఘన చరిత్ర... అంతకుమించిన వారసత్వం... అపార నైపుణ్యం... దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్‌కు మెరుగైన మౌలిక వసతులు ఉన్నా ఈ క్రీడలో తిరోగమనం దిశలో పయనిస్తున్న ఇటలీ... కనీస సౌకర్యాలు లేని క్రికెట్‌లో మాత్రం సత్తా చాటుతోంది. ప్రాక్టీస్ చేసేందుకు కనీసం పచ్చిక పిచ్‌లు కూడా లేకున్నా... ప్రపంచకప్‌నకు తొలిసారి అర్హత సాధించి భళా అనిపించింది. యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో సత్తా చాటడం ద్వారా వచ్చే ఏడాది జరగనున్న టి20 వరల్డ్‌కప్ బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న నేపథ్యంలో ఇటలీ క్రికెట్‌పై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడా విభాగం
ఫుట్‌బాల్‌ను విపరీతంగా అభిమానించే దేశంలో క్రికెట్‌కు క్రేజ్ దక్కుతుందా అనే స్థాయి నుంచి... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించే స్థాయికి ఇటలీ చేరుకుంది. క్లబ్‌లు, ఏజ్ గ్రూప్ మ్యాచ్‌లు, ప్రత్యేక టోర్నీలు, సన్నాహక మ్యాచ్‌లు ఇలా అన్నీ ఉన్న ఫుట్‌బాల్‌లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోతున్న ఇటలీ... ప్రాక్టీస్ చేసేందుకు సరైన మైదానాలు, మెరుగయ్యేందుకు అవసరమైన కనీస వసతులు లేని క్రికెట్‌లో మాత్రం రాణిస్తోంది.
మెరుగైన జీవన ప్రమాణాల కోసం వలస వచ్చిన ప్లేయర్లతో నిండిన జట్టు... వారం మొత్తం ఉద్యోగాలు చేసుకుంటూ వారాంతాల్లో వీలు చిక్కినప్పుడు మాత్రమే సాధన చేసే ప్లేయర్లతో ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందడం అంటే మామూలు విషయం కాదు. టి20 ప్రపంచకప్ యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం ద్వారా ఇటలీ జట్టు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించగా... తొలి మ్యాచ్‌లో పటిష్ట టీమిండియాతో ఆడాలనుకుంటున్నట్లు ఆ జట్టు సారథి జో బర్న్స్ వెల్లడించాడు.
ఆరస్టేలియా నుంచి ఇటలీకి...
ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున 23 టెస్టులు, 6 వన్డేలు ఆడిన జో బర్న్స్ కొన్నేళ్ల క్రితం ఇటలీకి వలస వెళ్లాడు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో బర్న్స్ పూర్వీకులుఆ్రస్టేలియాకు వెళ్లగా... ఇప్పుడు మెరుగైన కెరీర్ కోసం అతడు తిరిగి ఇటలీకి చేరుకున్నాడు. అప్పటికే నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు అందుబాటులో ఉన్నా... వారికి సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేకపోగా... బర్న్స్ రాకతో ఆ ఇబ్బంది తీరింది.
అతడితో పాటు ఆ్రస్టేలియాలో దేశవాళీ క్రికెట్ ఆడిన హ్యారీ మనెంటి, బెన్ మనెంటి... ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్ ఆడిన గే, స్టివర్ట్ వంటి ప్లేయర్లు... జాతీయ జట్ల తరఫున అవకాశం దక్కని ఉపఖండ ఆటగాళ్లతో ఇటలీ జట్టులో ప్రతిభకు కొదవ లేకుండా ఎదిగింది. బర్న్స్ సారథ్యంలో ఎప్పటికప్పుడు మెరుగవుతున్న ఇటలీ జట్టు... నెదర్లాండ్స్ తర్వాత ఐసీసీ టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన యూరప్ జట్టుగా నిలిచింది.
కెవిన్ ఒబ్రియాన్ కోచింగ్‌లో...
ఐర్లాండ్‌కు చెందిన ఆల్‌రౌండర్ కెవిన్ ఒబ్రియాన్ ఓసారి ఇటలీలో పర్యటిస్తున్న సమయంలో అక్కడి యువ ఆటగాళ్ల నైపుణ్యం చూసి ముచ్చట పడ్డాడు. మెరుగైన వసతులు లేకపోయినా... ప్లేయర్లలో ఏదో సాధించాలనే తపనను గమనించాడు. అలాంటి పరిస్థితులను దాటుకొని ప్రపంచకప్ స్థాయిలో మెరుపులు మెరిపించిన ఒబ్రియాన్.. అనంతరం కాలంలో ఇటలీ క్రికెట్ జట్టు సహాయక కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంతో ఆ జట్టు దశ తిరిగింది.
భారత్ వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై ఐర్లాండ్ రికార్డు లక్ష్యఛేదనతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన ఒబ్రియాన్... ఇటలీ ప్లేయర్లకు గొప్పగా శిక్షణనిచ్చాడు. ఇటలీ జట్టు టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడంతో తను పడ్డ కష్టానికి ఫలితం దక్కినట్లు అయిందని ఒబ్రియాన్ అన్నాడు. ‘కోచ్‌గా ఈ క్షణాలను ఆస్వాదిస్తున్నా. అసలు కోచింగ్ వైపు అడుగులు వేసినప్పుడు ఇదంతా ఊహించలేదు. కానీ ప్లేయర్లు నిబద్దతతో కృషి చేసి ప్రపంచకప్ బెర్త్ దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు ఎంతో ప్రత్యేకం’ అని పేర్కొన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న సమయంలో 2007 వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లపై ఐర్లాండ్ జట్టు విజయాలు సాధించడంలో ప్లేయర్‌గా ఒబ్రియాన్ కీలక పాత్ర పోషించాడు. సహాయక కోచ్‌గా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచే ‘ఏజ్ గ్రూప్ క్రికెట్’కు ప్రాధాన్యత ఇచ్చి వాటి ఫలితాలు బోర్డుకు అందించాడు.
ప్రపంచకప్‌తో ఆదరణ దక్కేనా!
యూరప్ క్వాలిఫయింగ్ టోర్నీ ప్రారంభానికి రెండు వారాల ముందు... ఇటలీ జాతీయ ఒలింపిక్ కమిటీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను క్రీడాంశంగా ప్రవేశపెట్టడంతో... ఇకపై మరింత తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ విషయంలో కొత్త ప్రమాణాలు నిర్దేశించింది. ఇటలీలో పచ్చిక పిచ్‌లు అందుబాటులో లేకపోవడంతో... కృత్రిమ పిచ్‌లపై సాధన చేసేలా జట్టును సిద్ధం చేసింది. ఇతర జట్లతో మ్యాచ్‌లసంఖ్యను సైతం పెంచింది.
‘టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించడం ఒక కీలక మలుపు. మా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. సౌకర్యాలు మెరుగైనప్పుడే యువత ఇటువైపు అడుగులు వేస్తుంది.ప్రపంచకప్ వంటి మెగాటోర్నీల్లో పాల్గొంటే... ఎక్కువ ఆదరణ దక్కుతుంది. తద్వారా దేశంలో ఆటకు ప్రాధాన్యత పెరుగుతుంది. అలాగే స్పాన్సర్లు, ఎండార్స్‌మెంట్‌ల రూపంలో ఆదాయం పెరుగుతుంది’ అని ఇటలీ క్రికెట్ జట్టు మేనేజర్ పీటర్ డి వెనుటో అన్నాడు.
కలుగమగె కథే వేరు...
శ్రీలంకకు చెందిన క్రిషన్ కలుగమగె 15 ఏళ్ల వయసులో ఇటలీకి వలస వెళ్లాడు. మొదట అథ్లెట్ కావాలనుకున్న క్రిషన్ ఆ తర్వాత క్రికెట్ వైపు మొగ్గు చూపాడు. అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో... ఒక రెస్టారెంట్‌లో పిజ్జా మేకర్‌గా పనికి కుదిరాడు. జీవన ప్రమాణాలు పెంచుకునేందుకు ఒకవైపు పని కొనసాగిస్తూనే... వ్యక్తిగత ఆసక్తిని చంపుకోలేక క్రికెట్‌ను కొనసాగించాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ 2022లో ఇటలీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.
ఇటలీలో క్రికెట్‌కు పెద్దగా గుర్తింపు లేకపోవడంతో... ఆ తర్వాత కూడా అతడు రెస్టారెంట్ ఉద్యోగం కొనసాగించాల్సిన పరిస్థితి. ఇలాంటి దశలో వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ టోర్నీ కోసం చేసే పనిని పక్కన పెట్టిన క్రిషన్... ఇటలీ జట్టు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన తర్వాత వచ్చిన స్పందనతో ఆశ్చర్యపోయాడు. ‘క్వాలిఫయింగ్ టోర్నీ ముగించుకొని ఇంటికి వచ్చిన సమయంలో అక్కడ వందలాది మంది పూలు, స్వీట్లతో నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఏమాత్రం ఊహించనిది. దీంతో ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యా’ అని కలుగమగె అన్నాడు.
స్టీరింగ్ పక్కన పెట్టి...
2006లో కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్‌ప్రీత్ సింగ్... అంచెలంచెలుగా ఎదుగుతూ 2019లో ఇటలీ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్ మాదిరిగా అక్కడ క్రికెట్‌కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ పొట్ట కూటి కోసం క్యాబ్ డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు.
2024 టి20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ సమయంలోనే ఇటలీ జట్టు త్రుటిలో మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం కోల్పోవడంతో... ఈసారి అలాంటి తప్పు జరగకూడదనే ఉద్దేశంతో... స్టీరింగ్‌ను పక్కన పెట్టిన జస్‌ప్రీత్ పూర్తిగా క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. అందుకు తగ్గ ఫలితం దక్కడం ఆనందంగా ఉందని అతడు వెల్లడించాడు. ‘వరల్డ్‌కప్‌కు తొలిసారి అర్హత సాధించిన ఇటలీ జట్టులో భాగస్వామిగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. పెద్దవాళ్లమయ్యాక ముందు తరాలకు చెప్పుకునేందుకు ఇంతకు మించి ఇంకేం కావాలి’ అని అన్నాడు.