లలిత్‌ మోదీ మాస్టర్‌ ప్లాన్‌!.. 1997-98లోనే బీసీసీఐకి ప్రపోజల్‌! | IPL Started In 2008, But Lalit Modi Pitched Idea To BCCI In 1997-98 | Sakshi
Sakshi News home page

అతడు 1997-98లోనే ఆ ప్రతిపాదన తెచ్చాడు: బీసీసీఐ మాజీ సెలక్టర్‌

Mar 25 2026 2:02 PM | Updated on Mar 25 2026 2:16 PM

IPL Started In 2008, But Lalit Modi Pitched Idea To BCCI In 1997-98

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. పొట్టి క్రికెట్‌ గతినే మార్చి వేసిన లీగ్‌.. భారత్‌లో 2008లో మొదలైన ఈ టీ20 టోర్నీ ప్రపంచవ్యాప్తంగా ఆదరణ చూరగొన్నది. గత పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ క్యాష్‌ రిచ్‌ లీగ్‌గా పేరొందింది.

ఐపీఎల్‌లో ఒక్కసారి ఆడితే చాలు తమ దశ తిరిగిపోతుందని ఆటగాళ్ల నమ్మకం. ఈ టీ20 లీగ్‌లో సత్తా చాటి జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కోకొల్లలు. ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఐపీఎల్‌ ద్వారానే వెలుగులోకి వచ్చారు.

ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు, లీగ్‌ తొలి చైర్మన్‌
ఐపీఎల్‌ ఈ స్థాయికి చేరడంలో లలిత్‌ మోదీకి కీలక పాత్ర. ఐపీఎల్‌ వ్యవస్థాపకుడు, లీగ్‌ తొలి చైర్మన్‌ అతడే. 2010 వరకు లీగ్‌ కమిషనర్‌గానూ లలిత్‌ మోదీ కొనసాగాడు. ఆ తర్వాత మనీ లాండరింగ్‌ ఆరోపణలతో అభాసుపాలై.. దేశం విడిచి పారిపోయిన ఎగవేతదారుగా ముద్రపడ్డాడు. ఏదేమైనా ఐపీఎల్‌కు అంకురార్పణ చేసింది అతడే. అందుకే అతడి పేరు భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోవడం ఖాయం.

1997-98 మధ్యకాలంలోనే ఆ ఐడియాతో..
కాగా 2008 కంటే దశాబ్దకాలం ముందే లలిత్‌ మోదీ ఐపీఎల్‌ గురించి బీసీసీఐ (BCCI)కి చెప్పాడట. టీమిండియా మాజీ సెలక్టర్‌, భారత మాజీ క్రికెటర్‌ సబా కరీం (Saba Karim) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దూరదర్శన్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘1997-98 మధ్యకాలంలోనే లలిత్‌ మోదీ టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్‌ ఆలోచనతో బీసీసీఐ దగ్గరికి వచ్చాడని చాలా మందికి తెలియదు.

ఐపీఎల్‌ ఆరంభానికి దాదాపు పదేళ్ల ముందు నుంచే ఇలాంటి లీగ్‌ గురించి లలిత్‌ మోదీ బీసీసీఐ వద్ద ప్రతిపాదన తెచ్చాడు. అప్పట్లో అసలు టీ20 క్రికెట్‌ గురించి ఆలోచనే లేదు. అంతా వన్డేల మయం. అయితే, అప్పట్లోనే టీ20 క్రికెట్‌ కోసం బెంగాల్‌ నుంచి ఓ జట్టు తయారు చేయాలని మేము అనుకున్నాము.

కాంట్రాక్టు కూడా..
వాళ్లతో కాంట్రాక్టు కూడా కుదుర్చుకున్నాము. అయితే, వివిధ కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఆ లీగ్‌ గురించిన ఆలోచన మాత్రం మా మెదళ్లలో ఉండిపోయింది’’ అని సబా కరీం చెప్పుకొచ్చాడు. కాగా 2008లో మొదలైన ఐపీఎల్‌ విలువ ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు. 

ఆరంభ సీజన్‌ విజేత రాజస్తాన్‌ రాయల్స్‌ ఫ్రాంఛైజీ తాజాగా రూ. 15 వేల కోట్లకు పైగా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీ రూ. 16 వేల కోట్లకు అమ్ముడుపోవడం ఇందుకు చిన్నపాటి నిదర్శనాలు. ఇక ఈ ఏడాది మార్చి 28న ఐపీఎల్‌కు తెరలేవనుంది.

చదవండి: రూ. 15 వేల కోట్లకు అమ్మకం.. షేన్‌ వార్న్‌ వాటా ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement