రసిఖ్ (PC: RCB X)
‘ఈ సాలా కప్ నమ్‌దూ’ అంటూ పద్దెనిమిదేళ్లుగా ఎదురుచూసిన అభిమానుల కలను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) గతేడాది నిజం చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. అయితే, అంతటితో ఆర్సీబీ ఆకలి తీరలేదు.
ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్-2026లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో మరోసారి టైటిల్ విజేతగా అవతరించింది. అహ్మదాబాద్‌లో ఆదివారం నాటి ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి.. ‘ఈ సాలనూ కప్ నమ్‌దూ’ (ఈసారీ కప్పు మనదే) అంటూ విజిల్స్ వేయించింది.
చివరి నిమిషంలో సువర్ణావకాశం
నిజానికి ఆర్సీబీ అ‘ద్వితీయ’విజయంలో పేస్ బౌలింగ్ దళానిదే కీలక పాత్ర. టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), ఆస్ట్రేలియా స్టార్ జోష్ హాజిల్‌వుడ్ (15 వికెట్లు) ముందుండి నడిపించగా... మరో భారత కుర్రాడి పాత్ర కూడా మరువలేనిది.
గతేడాది సత్తా చాటినా.. వివాదం కారణంగా చివరి నిమిషంలో యశ్ దయాళ్ దూరం కావడంతో మూడో పేసర్‌గా సత్తా చాటాల్సిన స్థితిలో తనకు లభించిన అవకాశాన్ని అతడు సమర్థంగా వినియోగించుకున్నాడు.
అతడు మరెవరో కాదు జమ్ము కశ్మీర్‌కు చెందిన 26 ఏళ్ల రసిఖ్ సలామ్. ఈ సీజన్‌లో 19 వికెట్లతో రాణించి.. తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయంలో భాగమయ్యాడు. అనూహ్య మలుపులతో సాగిన కెరీర్‌లో అతడు ఇక్కడి వరకు రాగలిగాడు.
రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ!
ఐపీఎల్‌లో 2019లో తొలిసారి ముంబై ఇండియన్స్ తరఫున ఒకే ఒక మ్యాచ్ ఆడి సలామ్ అరంగేట్రం చేశాడు. కొద్ది రోజుల్లోనే ‘తప్పుడు వయసు’ను చూపించిన కారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై రెండేళ్ల నిషేధం విధించింది. దీంతో 2020 అండర్–19 వరల్డ్ కప్ ఆడే అవకాశం కోల్పోయాడు సలామ.
ముంబై అండతో..
అయితే ముంబై ఇండియన్స్ అండగా నిలిచి అన్ని సౌకర్యాలతో తమ ప్రైవేట్ క్లబ్‌లో అతడికి రెండేళ్ల పాటు ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ క్రమంలో 2022లో మళ్లీ ఐపీఎల్ అవకాశం దక్కగా కేకేఆర్ 2 మ్యాచ్‌లే ఆడించింది.
ఇక 2023లో సలామ్ గాయంతో ఆటకు దూరమయ్యాడు. కారు ప్రమాదం నుంచి కోలుకొని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేస్తున్న రిషభ్ పంత్... సలామ్ బౌలింగ్ పదును చూసి ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో అవకాశం కల్పించాడు.
రసిఖ్ అంటే ‘నిలకడ’
అలా 2024లో 8 మ్యాచ్‌లు ఆడే చాన్స్ లభించడంతో సలామ్ ఆకట్టుకున్నాడు. ఇక గతేడాది ఆర్సీబీ రూ.6 కోట్లకు అతడిని తీసుకున్నప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో రెండు మ్యాచ్‌లలోనే అవకాశం దక్కింది కానీ జట్టు అతడిలో మంచి భవిష్యత్తును చూసింది. దాని ఫలితం ఈ సారి కనిపించింది. కశ్మీరీ భాషలో రసిఖ్ అంటే ‘నిలకడ’ అని అర్థం.
ఈసారి 12 మ్యాచ్‌లలో నిలకడగా రాణించిన సలామ్ కీలక సమయాల్లో వికెట్లు తీసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టి.. జట్టులో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో సీనియర్లు భువీ, హాజిల్‌వుడ్ కంటే.. సలామ్ మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 27 పరుగులే ఇచ్చి.. నిశాంత్ సింధు (20), రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ (7) రూపంలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.
Moments that became memories. Memories that became history. 🏆
🎥 Reliving the defining moments of @RCBTweets going back-2️⃣-back in Ahmedabad ❤️#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/mHL9U36rB1— IndianPremierLeague (@IPL) June 1, 2026


