
2026 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌ను నియమించుకుంది. కేకేఆర్ నుంచి తాజాగా బయటికి వచ్చిన భరత్ అరుణ్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.
అరుణ్ కేకేఆర్ 2024 సీజన్‌లో విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఛాంపియన్‌గా నిలిచింది. అరుణ్ అంతకుముందు టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేశాడు. 2014-2021 వరకు భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా పని చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు.
అరుణ్ 2022లో కేకేఆర్‌తో జతకట్టి నాలుగు సీజన్ల పాటు ఆ జట్టుతో కొనసాగాడు. తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి వైదొలగడంతో అరుణ్ కూడా బయటికి వచ్చేశాడు. లక్నో బౌలింగ్ కోచ్‌గా అరుణ్ ఏడాది మొత్తం అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మధ్యలో వేరే ఏ ఒప్పందాలు చేసుకోకూడదు. దీనికి సమ్మతించే అరుణ్ సంజీవ్ గెయెంకా జట్టుతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.
వాస్తవానికి ఇప్పటివరకు లక్నోకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్ లేడు. స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబేతో పని కానిచ్చేస్తుంది. తాజాగా అరుణ్‌ను స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకోవడంతో లక్నో బౌలింగ్ విభాగం బలపడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మెంటార్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో అతనే బౌలింగ్ కోచ్ బాధ్యతలను మోశాడు.
2022 సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో తొలి రెండు సీజన్లు మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరగా.. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు గత సీజన్‌లోనే కేఎల్ రాహుల్‌ను మార్చి రిషబ్ పంత్‌ను కొత్త కెప్టెన్‌గా తెచ్చుకుంది. పంత్‌కు లక్నో యాజమాన్యం రికార్డు స్థాయిలో 27 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకుంది.
గత సీజన్‌లో ఇతర జట్లతో పోలిస్తే లక్నో బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపించింది. ఆ జట్టులో ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్ పేసర్లుగా ఉండగా.. మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉన్నారు.