IPL 2022: డబ్బు డిమాండ్‌ చేసానన్నది అవాస్తవం.. ఆర్సీబీపై చహల్‌ సంచలన వ్యాఖ్యలు

IPL 2022: Yuzvendra Chahal Sensational Comments On RCB - Sakshi

Yuzvendra Chahal: 8 సీజన్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఆడి, ఐపీఎల్‌ 2022కి ముందు రాజస్థాన్‌ రాయల్స్‌లో భాగమైన టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌.. తనకెంతో గుర్తింపు తెచ్చిన ఆర్సీబీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ జాతీయ మీడియాతో చహల్‌ మాట్లాడుతూ.. ఆర్సీబీతో ఏర్పడిన ఎమోషనల్ బాండింగ్ గురించి, గతేడాది ఐపీఎల్‌ తదనంతరం ఆర్సీబీలో చోటు చేసుకున్న పరిణామాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్‌లో ఆర్సీబీ కాకుండా మరే ఇతర జట్టుకు ఆడతానని అనుకోలేదని, అంతలా ఆ జట్టుతో, అక్కడి అభిమానులతో మమేకమైపోయానని, అలాంటిది ఐపీఎల్‌ 2022 రిటెన్షన్‌ సమయంలో జరిగిన కీలక పరిణామాల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టును వీడాల్సి వచ్చిందని వాపోయాడు. ఆర్సీబీలో కొనసాగేందుకు తాను ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేశానని కొందరు పనిగట్టుకుని సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి ఆర్సీబీనే తనను రిటైన్‌ చేసుకునేందుకు కానీ, వేలంలో తిరిగి దక్కించుకునేందుకు కానీ ఆసక్తి చూపలేదని కీలక వ్యాఖ్యలు చేశాడు. 

రిటెన్షన్ ప్రక్రియకు కొన్ని రోజుల ముందు ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్ తనకు ఫోన్ చేశాడని, రిటెన్షన్‌లో మూడు స్లాట్లు మాత్రమే ఉన్నాయని చెప్పాడని, వాటిని విరాట్, మ్యాక్స్ వెల్, సిరాజ్‌లతో భర్తీ చేయాలనుకుంటున్నామని తెలిపాడని వివరించాడు. ఆ సమయంలో హెస్సన్‌ తనను రిటైన్ చేసుకునేది కానీ, వేలంలో దక్కించుకుంటామని కానీ చెప్పలేదని అన్నాడు. ఒకవేళ హెస్సన్‌ నన్ను వేలంలో దక్కించుకుంటానని చెప్పి ఉంటే సంతోషించేవాడినని, కానీ అలా జరగకపోవడం బాధించిందని వాపోయాడు. ఏదిఏమైనా తాను ఐపీఎల్‌ అరంగేట్రం (2010) చేసిన జట్టుకే తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు. కాగా, చహల్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో 114 మ్యాచ్‌ల్లో 139 వికెట్లు పడగొట్టాడు. 
చదవండి: మైకేల్ వాన్, వసీం జాఫర్ మధ్య ట్విటర్‌ వార్‌.. కత్తులు దూసుకున్న మాజీలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top