పాండే 14 సార్లు.. ఎస్‌ఆర్‌హెచ్‌ 11 సార్లు 

IPL 2021: SRH Ended Up Losing 11 Times When Pandey Batted 30 Plus Balls - Sakshi

చెన్నై:  29 బంతుల్లో 55 పరుగులు.. 29 బంతుల్లో 43 పరుగులు.. 24 బంతుల్లో 27 పరుగులు.. 24 బంతుల్లో 35 పరుగులు.. ఇది సన్‌రైజర్స్‌ గత రెండేళ్లలో టార్గెట్‌ను ఛేదించే క్రమంలో చతికిలబడిన వైనం. 2019 ఐపీఎల్‌  నుంచి చూస్తే సన్‌రైజర్స్‌ పరిస్థితి ఇలా ఉంది.  ఆర్సీబీతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో చివరి నాలుగు ఓవర్ల సన్‌రైజర్స్‌ 24 బంతుల్లో 35 పరుగులు సాధిస్తే విజయం సాధిస్తుంది. కానీ ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిని కొనితెచ్చుకుంది. 29 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు చేజార్చుకుని పరాజయాన్ని చవిచూసింది.

అంతకుముందు గత రెండు సీజన్ల వారిగా చూస్తే గతేడాది దుబాయ్‌ వేదికగా  కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ 14 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది.  24 బంతుల్లో 27 పరుగులు చేయాల్సిన సమయంలో సన్‌రైజర్స్‌ ఇలా కుప్పకూలింది. అదే ఏడాది ఆర్సీబీతో దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 32 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయింది. 29 బంతుల్లో 43 పరుగులు చేసే క్రమంలో ఆరెంజ్‌ ఆర్మీ ఇలా చతికలిబడింది. దాంతో అప్పుడు ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో  విజయం సాధించింది. ఇక 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో హైదరాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 15 పరుగుల వ్యవధిలో 8 వికెట్లను నష్టపోయింది. ఎస్‌ఆర్‌హెచ్‌ 29 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన తరుణంలో ఇలా పేకమేడలా కూలిపోయింది ఎస్‌ఆర్‌హెచ్‌.

పాండే 14సార్లు.. ఎస్‌ఆర్‌హెచ్‌ 11సార్లు
గత నాలుగు సీజన్లు(2018 నుంచి) మనీష్‌ పాండే 30, అంతకంటే ఎక్కువ బంతులన్ని 14సార్లు ఆడగా, అందులో ఎస్‌ఆర్‌హెచ్‌ 11సార్లు ఓటమి పాలుకావడం ఇప్పుడు చర్చనీయాశమైంది. ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్‌లో పాండే 39 బంతులు ఆడి 2 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ఔటయ్యాడు.  షెహబాజ్‌ వేసిన ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు సాధించాడు. ముందు బెయిర్‌ స్టోను, ఆపై మనీష్‌ పాండే, అబ్దుల్‌ సామద్‌లను బోల్తా కొట్టించి సన్‌రైజర్స్‌ క్యాంప్‌ను టెన్షన్‌లో పెట్టాడు. ఆపై మరుసటి ఓవర్‌ను హర్షల్‌ పటేల్‌ వేయగా విజయ్‌ శంకర్‌ పెవిలియన్‌ చేరాడు.

ఫలితంగా 8 పరుగుల వ్యవధిలో సన్‌రైజర్స్‌ నాలుగు వికెట్లను నష్టపోయింది. 19 ఓవర్‌లో మరొక వికెట్‌ను నష్టపోవడంతో 15 పరుగుల వ్యవధిలో ఐదు  వికెట్లను ఆరెంజ్‌ ఆర్మీ చేజార్చుకుంది. ఇలా 29 పరుగుల  వ్యవధిలో 7 వికెట్లను కోల్పోవడంతో సన్‌రైజర్స్‌ ఓటమి పాలైంది.  ఇక ఆర్సీబీ అత్యల్ప స్కోర్లను కాపాడుకుని గెలిచిన మ్యాచ్‌ల్లో నిన్నటి మ్యాచ్‌ టాప్‌-4లో చేరింది. 2008లో  చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేను 126 పరుగులకే పరిమితం చేసి గెలిచిన ఆర్సీబీ.. 2009లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ను 133 పరుగులకే కట్టడి చేసి విజయం సాధించింది. అదే ఏడాది డర్బన్‌ వేదికగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌(ప్రస్తుతం పంజాబ్‌ కింగ్స్‌) జరిగిన మ్యాచ్‌లో 145 పరుగులకే నిలువరించిన ఆర్సీబీ గెలుపును అందుకుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top