అత్యధిక సెంచరీ వీరులు వీరే.. సెహ్వాగ్‌ సరసన సామ్సన్‌

IPL 2021: Sanju Samson Joins AB de Villiers In Most Centuries List Of IPL - Sakshi

న్యూఢిల్లీ: పొట్టి ఫార్మాట్‌లో సెంచరీ కొట్టడం అంటే ఈజీ కాదు.  నిలబడ్డాక కొడతా అంటే ఇక్కడ కుదరదు. క్రీజ్‌లోకి వచ్చింది మొదలు బౌండరీల మోత మోగిస్తేనే ఈ ఫార్మాట్‌లో సెంచరీ చేయడానికి వీలువుతుంది. పొట్టి ఫార్మాట్‌లో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ ప్రత్యేకం. ఈ లీగ్‌కు ఇంత ఆదరణ వచ్చిందంటే అందుకు బ్యాటర్స్‌ మెరుపులే ముఖ్య కారణం. నిన్న పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ సామ్సన్‌ ఆడిన తీరు ప్రేక్షకుల్లో మంచి జోష్‌ను తీసుకు వచ్చింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌ల్లో ఇదే మంచి హై ఓల్టేజ్‌ మ్యాచ్‌. పంజాబ్‌ కింగ్స్‌పై సామ్సన్‌ విరుచుకుపడటంతో మ్యాచ్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

జట్టును గెలిపించలేకపోయినా సామ్సన్‌ చివరి వరకూ పోరాడిన తీరు అద్వితీయం.  63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 119 పరుగులు సాధించాడు సామ్సన్‌. జస్ట్‌ మిస్‌ కానీ మ్యాచ్‌ను దాదాపు గెలిపించేంత పని చేశాడు. ఇది సామ్సన్‌కు ఐపీఎల్‌లో మూడో సెంచరీగా నమోదైంది. ఫలితంగా ఈ లీగ్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన జాబితాలో చేరిపోయాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో క్రిస్‌ గేల్‌(6 సెంచరీలు) తొలి స్థానంలో ఉండగా, విరాట్‌ కోహ్లి(5 శతకాలు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక షేన్‌ వాట్సన్‌-డేవిడ్‌ వార్నర్‌లు తలో నాలుగు సెంచరీలు సాధించి మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ఇప్పటివరకూ ఏబీ డివిలియర్స్‌ మూడు సెంచరీలు ఉండగా, అతని సరసన సంజూ సామ్సన్‌ కూడా చేరాడు. 

ఆర్‌ఆర్‌ తరఫున మూడో ఆటగాడిగా..
రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున రెండు వేల పరుగులు సాధించిన జాబితాలో సంజూ సామ్సన్‌ మూడో స్థానంలో నిలిచాడు.  అంతకుముందు రాజస్థాన్‌ తరఫున రెండు వేల పరుగుల మార్కును దాటిన ఆటగాళ్లలో అజింక్యా రహానే(2,810), వాట్సన్‌(2,372)లు ఉన్నారు. 

సెహ్వాగ్‌ సరసన సామ్సన్‌
ఐపీఎల్‌లో సెకండ్‌ బ్యాటింగ్‌ చేస్తూ అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్‌ సరసన నిలిచాడు సామ్సన్‌.  2011లో డెక్కన్‌ చార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ఆడిన సెహ్వాగ్‌ 119 పరుగులు సాధించాడు. ఇప్పుడు అన్నే పరుగులు  చేశాడు సామ్సన్‌.  రెండోసారి బ్యాటింగ్‌ చేసే క్రమంలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన ఆటగాళ్లలో పాల్‌ వాల్దాటి(120 నాటౌట్‌) టాప్‌లో ఉన్నాడు.  2011లో కింగ్స్‌ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించిన వాల్దాటి.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 120 పరుగులు చేశాడు. 

ఇక్కడ చదవండి: సామ్సన్‌ చేసింది కరెక్టే  కదా..!

ఇంత బాగా రాణిస్తాడని అస్సలు ఊహించలేదు: సెహ్వాగ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top