మ్యాచ్‌ గెలవడం కోసం క్రీడాస్ఫూర్తిని పక్కనబెట్టారు

IPL 2021: Brad Hogg Raises Spirit Of Game MI Takes Advantage Last ball - Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో శనివారం సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. ముంబై ఆల్‌రౌండర్‌ పొలార్డ్‌ అద్భుత బ్యాటింగ్‌ కనబరిచి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హగ్‌ మాత్రం ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ గెలవడం కోసం క్రీడాస్పూర్తిని పక్కన బెట్టిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

విషయంలోకి వెళితే.. ముంబై విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి. పొలార్డ్‌ స్ట్రైక్‌లో ఉండగా.. నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ధావల్‌ కులకర్ణి ఉన్నాడు. ఎన్గిడి బంతి విసరకముందే నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న కులకర్ణి అడ్వాన్స్‌గా ఆలోచించి క్రీజు దాటి చాలా ముందుకు వచ్చాడు. పొలార్డ్‌ బంతిని హిట్‌ చేయడం.. చకచకా రెండు పరుగులు పూర్తి చేయడం.. మ్యాచ్‌ గెలవడం జరిగిపోయాయి. అయితే మ్యాచ​ గెలవడం కోసం కులకర్ణి అడ్వాంటేజ్‌ చేసుకొని ముందుకు పరిగెత్తుకురావడం సమంజసం కాదని హగ్‌ పేర్కొన్నాడు. అలా చేస్తే క్రీడాసూర్తిని మరిచినట్లేనని తెలిపాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తన ట్విటర్‌లో ఒక క్యాప్షన్‌ జత చేశాడు. '' నిన్నటి మ్యాచ్‌లో ఒక విషయం నన్ను బాధించింది. చివరి బంతికి నాన్‌ స్ట్రైకర్‌ అడ్వాంటేజ్‌ తీసుకొని బౌలర్‌ బంతి విడవకముందే క్రీజు దాటడం క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఒక మ్యాచ్‌ గెలవడం కోసం ఇలా చేస్తారా'' అంటూ రాసుకొచ్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు(72 నాటౌట్‌, 27 బంతులు; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సీఎస్‌కే భారీ స్కోరు నమోదు చేసింది. జడేజా 22 పరుగులతో రాయుడుకు సహకరించాడు. అంతకముందు ఓపెనర్‌ డుస్లెసిస్‌ 50, మొయిన్‌ అలీ 58 పరుగులతో రాణించారు. ఇక చేజింగ్‌లో  పొలార్డ్‌ (87 నాటౌట్‌, 34 బంతులు;  6 ఫోర్లు, 8 సిక్సర్లతో) విద్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కొడితే ఫోర్‌.. లేదంటే సిక్స్‌ అన్నట్లుగా రెచ్చిపోయిన పొలార్డ్‌ ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని సాధించిపెట్టాడు. రోహిత్‌ 38, డికాక్‌ 35, కృనాల్‌ 32, హార్దిక్‌ 16 పరుగులు చేశారు.
చదవండి: ఆ బంతిని కూడా ఫోర్‌ కొడితే ఇంకేం చేస్తాం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top