హోర్‌సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత మహిళల జట్టు తొలి విజయం అందుకుంది. ఉక్రెయిన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–19, 22–20తో పొలీనా బురోవాపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–12, 17–21, 21–10తో యెహెనియా కాంటిమిర్‌ను ఓడించింది. మూడో మ్యాచ్‌లో దేవిక సిహాగ్ 23–21, 21–13తో మరియా స్టొలియారెంకోపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖరారు చేసింది.
నాలుగో మ్యాచ్‌లో సెల్వం కవిప్రియ–సిమ్రన్ ద్వయం 11–21, 17–21తో పొలీనా బురోవా–యెహెనియా కాంటిమిర్ జోడీ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పీవీ సింధు–తనీషా క్రాస్టో జోడీ 21–18, 21–15తో మరియా స్టొలియారెంకో–సోఫియా లావ్రోవా జంటపై విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో చైనా 5–0తో డెన్మార్క్ జట్టును ఓడించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన చైనా జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా... రెండో బెర్త్ కోసం భారత్, డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లు రేసులో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చైనాతో భారత్; డెన్మార్క్‌తో ఉక్రెయిన్ తలపడతాయి.


