Uber Cup World Team Championship
-
భారత్ మహిళల బ్యాడ్మింటన్ జట్టుకు తొలి విజయం
హోర్సెన్స్ (డెన్మార్క్): ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు తొలి విజయం అందుకుంది. ఉక్రెయిన్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో భారత్ 4–1తో గెలుపొందింది. తొలి మ్యాచ్‌లో ఉన్నతి హుడా 21–19, 22–20తో పొలీనా బురోవాపై నెగ్గింది. రెండో మ్యాచ్‌లో తన్వీ శర్మ 21–12, 17–21, 21–10తో యెహెనియా కాంటిమిర్ను ఓడించింది. మూడో మ్యాచ్‌లో దేవిక సిహాగ్ 23–21, 21–13తో మరియా స్టొలియారెంకోపై గెలిచి భారత్‌కు 3–0తో విజయాన్ని ఖరారు చేసింది. నాలుగో మ్యాచ్‌లో సెల్వం కవిప్రియ–సిమ్రన్ ద్వయం 11–21, 17–21తో పొలీనా బురోవా–యెహెనియా కాంటిమిర్ జోడీ చేతిలో ఓడిపోయింది. ఐదో మ్యాచ్‌లో పీవీ సింధు–తనీషా క్రాస్టో జోడీ 21–18, 21–15తో మరియా స్టొలియారెంకో–సోఫియా లావ్రోవా జంటపై విజయం సాధించింది. గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో చైనా 5–0తో డెన్మార్క్ జట్టును ఓడించింది. వరుసగా రెండు విజయాలు సాధించిన చైనా జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా... రెండో బెర్త్ కోసం భారత్, డెన్మార్క్, ఉక్రెయిన్ జట్లు రేసులో ఉన్నాయి. నేడు జరిగే చివరిదైన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో చైనాతో భారత్; డెన్మార్క్‌తో ఉక్రెయిన్ తలపడతాయి. -
అమ్మాయిలు అదుర్స్
ఆస్ట్రేలియాపై 5-0తో గెలుపు ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ కున్షాన్ (చైనా): మరోసారి పతకంపై దృష్టి పెట్టిన భారత మహిళల బ్యాడ్మింటన్ జట్టు ఉబెర్ కప్ ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 5-0తో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించింది. మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో సైనా నెహ్వాల్, పీవీ సింధు, గద్దె రుత్విక శివాని గెలుపొందగా... రెండు డబుల్స్ మ్యాచ్‌ల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్పప్ప; సిక్కి రెడ్డి-సింధు జోడీలు విజయం సాధించాయి. తొలి మ్యాచ్‌లో సైనా 22-20, 21-14తో సువాన్ వెండీ చెన్పై... రెండో మ్యాచ్‌లో సింధు 21-12, 21-11తో జాయ్ లాయ్‌పై గెలిచారు. మూడో మ్యాచ్‌లో జ్వాల-అశ్విని జోడీ 21-9, 21-15తో సువాన్ వెండీ చెన్-గ్రోన్యా సోమెర్‌విల్లె జంటను ఓడించడంతో భారత్ 3-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగో మ్యాచ్‌లో రుత్విక శివాని 21-5, 21-11తో టిఫానీ హోను ఓడించగా... ఐదో మ్యాచ్‌లో సిక్కి రెడ్డి-సింధు ద్వయం 21-12, 21-12తో లెనీ చూ-జాయ్ లాయ్ జంటపై గెలుపొందడంతో భారత్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది. థామస్ కప్‌లో భాగంగా భారత పురుషుల జట్టు హాంకాంగ్‌తో ఆడుతుంది.


