భారత జట్టులో శ్రీ చరణి | Indian team announced for Womens Tri Nation ODI Tournament | Sakshi
Sakshi News home page

భారత జట్టులో శ్రీ చరణి

Apr 9 2025 3:43 AM | Updated on Apr 9 2025 3:43 AM

Indian team announced for Womens Tri Nation ODI Tournament

మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ కోసం భారత జట్టు ప్రకటన

న్యూఢిల్లీ: ఈనెలలో శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కెపె్టన్‌గా, స్మృతి మంధాన వైస్‌ కెపె్టన్‌గా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి, శుచి ఉపాధ్యాయ్‌ (మధ్యప్రదేశ్‌), కాశ్వీ గౌతమ్‌ (పంజాబ్‌)లకు తొలిసారి జాతీయ జట్టులో చోటు లభించింది. 

గాయం కారణంగా పేస్‌ బౌలర్లు రేణుక సింగ్, టిటాస్‌ సాధు, పూజ వస్త్రకర్‌లను ఎంపిక చేయలేదని బీసీసీఐ ప్రకటించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో విశేషంగా రాణించినప్పటికీ ఓపెనర్‌ షఫాలీ వర్మను సెలెక్టర్లు మరోసారి పట్టించుకోకపోవడం గమనార్హం. 

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా యర్రగుంట్ల మండలం యర్రంపల్లె గ్రామానికి చెందిన 20 ఏళ్ల శ్రీ చరణి గత నెలలో ముగిసిన డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఎడంచేతి వాటం స్పిన్నర్‌ అయిన శ్రీ చరణి రెండు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టింది. భారత జట్టులో చోటు దక్కించుకున్న శ్రీ చరణికి వైఎస్‌ఆర్‌ జిల్లా క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు భరత్‌ రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్, మహిళల విభాగం కో ఆర్డినేటర్‌ విష్ణుమోహన్‌ రావు అభినందనలు తెలిపారు.  

భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొనే ముక్కోణపు వన్డే టోర్నీ ఏప్రిల్‌ 27 నుంచి మే 11వ తేదీ వరకు కొలంబోలో జరుగుతుంది. డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మూడు జట్లు నాలుగు మ్యాచ్‌ల చొప్పున ఆడతాయి. టాప్‌–2లో నిలిచిన రెండు జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలోని అన్ని మ్యాచ్‌లు కొలంబోలోని ఆర్‌.ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి.  

భారత వన్డే జట్టు: హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), ప్రతిక రావల్, హర్లీన్‌ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యస్తిక భాటియా, దీప్తి శర్మ, అమన్‌జ్యోత్‌ కౌర్, స్నేహ్‌ రాణా, అరుంధతి రెడ్డి, తేజల్‌ హసబ్నిస్, నల్లపురెడ్డి శ్రీ చరణి, కాశ్వీ గౌతమ్, శుచి ఉపాధ్యాయ్‌. 

Advertisement
 
Advertisement
Advertisement