
ఇంగ్లండ్‌తో నేడు రెండో వన్డే
సిరీస్ లక్ష్యంగా బరిలోకి టీమిండియా
మధ్యాహ్నం గం. 3:30 నుంచి ‘సోనీ స్పోర్ట్స్’లో ప్రత్యక్ష ప్రసారం
లండన్: భారత మహిళల జట్టు ఇంగ్లండ్ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. నేడు ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్ మైదానంలో జరిగే రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం గెలిస్తే వరుస సిరీస్‌లతో పండగ చేసుకోవడం ఖాయం. టాపార్డర్ సూపర్ ఫామ్, బౌలింగ్‌లో నిలకడ కనబరుస్తున్న టీమిండియాకు విజయం, సిరీస్ కైవసం ఏమంత కష్టం కానేకాదు.
ఇంగ్లండ్ మాత్రం వన్డే సిరీస్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యం ఆతిథ్య జట్టుకు ప్రతికూల ఫలితాలిస్తున్నాయి. గత ఓటమి నుంచి బయటపడి, కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.
జోరుమీదున్న భారత్
బ్యాటర్లు, బౌలర్లు అందరు ఫామ్‌లో ఉండటం భారత జట్టులో సమరోత్సాహాన్ని అమాంతం పెంచుతోంది. వన్డే జట్టులోకి రాగానే ప్రతీక రావల్ సత్తా చాటుకుంది. స్మృతి, హర్లీన్ డియోల్‌లు కూడా మెరుగ్గానే ఆడారు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్... ఈ ఇద్దరు మాత్రమే రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. కానీ మిడిలార్డర్లో జెమీమా, దీప్తి శర్మ మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్ ఆడటంతో బ్యాటింగ్ మరింత పటిష్టమైంది. బౌలింగ్‌లో క్రాంతి, స్నేహ్ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్‌లు సమష్టిగా ఇంగ్లండ్ బ్యాటర్ల భరతం పట్టారు. లార్డ్స్ లోనూ మరో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తే ఎంచక్కా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవచ్చు.
ఓడితే ఇక నెగ్గలేరు
మరోవైపు భారత్‌తో పోలిస్తే... ఆతిథ్య ఇంగ్లండ్‌ది భిన్నమైన పరిస్థితి. సొంతగడ్డపై ఇదివరకే టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయే స్థితిలో ఉంది. ‘లార్డ్స్’ పోరులో ఓడితే ఇక సిరీస్ నెగ్గే అవకాశమే ఉండదు. ప్రధాన ప్లేయర్లంతా కీలకమైన తరుణంలో చేతులెత్తేయడం... పరుగులో వెనుకబడటం, వికెట్లు తీయడంలో అలసత్వం... ఇవన్నీ ఆతిథ్య జట్టుకు కొండంత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి.
ఇలాంటి ఒత్తిడి ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో నిలవడం కాస్త కష్టమైన పనే! గత మ్యాచ్‌లో ఓపెనర్లు టామీ బ్యూమోంట్, అమీ జోన్స్‌ల ఘోరమైన వైఫల్యం జట్టుకు ప్రతికూలమైంది. మిడిలార్డర్‌లో సోఫియా డంక్లీ, అలైస్ రిచర్డ్స్‌ల అర్ధసెంచరీలతో జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది.
అయితే బౌలర్లు నిరుత్సాహపరిచే ప్రదర్శనతో లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించింది. కేట్ క్రాస్, లారెన్ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే సిరీస్‌లో నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు బాధ్యత కనబరిస్తేనే ఆశించిన ఫలితాన్ని రాబట్టొచ్చు.
తుదిజట్లు (అంచనా)
భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), ప్రతీక, స్మృతి మంధాన, హర్లీన్, జెమీమా, దీప్తిశర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, స్నేహ్ రాణా, శ్రీచరణి, క్రాంతి గౌడ్.
ఇంగ్లండ్: నాట్ సీవర్ బ్రంట్ (కెప్టెన్), బ్యూమోంట్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ, అలైస్ రిచర్డ్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్, కేట్ క్రాస్, లారెన్ ఫైలెర్, లారెన్ బెల్.
ఇంగ్లండ్ జట్టు, ప్రతీకలపై జరిమానా
భారత టాపార్డర్ బ్యాటర్ ప్రతీక రావల్ మ్యాచ్ ఫీజులో కోత విధించారు. సౌతాంప్టన్‌లో తొలి వన్డే సందర్భంగా 18వ ఓవర్ వేసిన లారెన్ ఫైలెర్, ఆ మరుసటి ఓవర్ వేసిన సోఫీ ఎకిల్‌స్టోన్‌తో ప్రతీక అనుచితంగా ప్రవర్తించింది. ఇది ప్లేయర్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమే అని తేల్చిన రిఫరీ ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
మరోవైపు మందకొడి బౌలింగ్ నమోదు చేసినందుకు ఇంగ్లండ్ జట్టు మొత్తానికి జరిమానా పడింది. నిర్ణీత సమయంలో కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో ప్లేయర్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత పెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
4 లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్, మరో రెండింటిలో ఇంగ్లండ్ గెలిచాయి. ఈ మైదానంలో ఇంగ్లండ్‌పై భారత్ అత్యధిక స్కోరు 230 కాగా, అత్యల్ప స్కోరు 169.