
టి20 సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆస్ట్రేలియా మహిళల ‘ఎ’ జట్టు
మెక్‌కే: భారత ‘ఎ’ మహిళల జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడింది. ఇదివరకే అనధికారిక టి20 సిరీస్‌ను చేజార్చుకున్న అమ్మాయిల జట్టు ఆఖరి పోరులో గెలుపు తీరానికి చేరువై చివరకు 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో అనధికారిక టి20 సిరీస్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. స్పిన్ ద్వయం రాధా యాదవ్ (3/31), ప్రేమ రావత్ (3/24)ల మాయాజాలానికి ఆసీస్ ఇన్నింగ్స్ తడబడింది.
మేడ్‌లైన్ (32 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్), అలీసా హీలీ (21 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్), అనిక (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడారు. అయితే వరుస విరామాల్లో రాధ, ప్రేమలిద్దరు వికెట్లు పడగొట్టడంతో ఆసీస్ జోరుకు అడ్డుకట్ట పడింది. తర్వాత ఛేదించదగిన లక్ష్యమే అయినా... టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్ల నిర్లక్ష్యంతో భారత్ ‘ఎ’ అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 140 పరుగులే చేశారు.
ఓపెనర్ వృంద (4), ఉమా ఛెత్రి (3) నిరాశపరిచారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 41; 6 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే బాధ్యతగా ఆడింది. రాఘ్వి బిస్త్ (25 బంతుల్లో 25; 2 ఫోర్లు), మిన్ను మణి (29 బంతుల్లో 30; 4 ఫోర్లు)ల పోరాటంతో గెలుపు దారిలో పడిన భారత్‌ను 19వ ఓవర్ దెబ్బ కొట్టింది. 12 బంతుల్లో 18 పరుగుల సమీకరణం టి20ల్లో ఏమాత్రం కష్టం కాదు.
కానీ 19వ ఓవర్ వేసిన సియానా జింజర్ (4/16) తొలి బంతికి సజన (3), ఐదో బంతికి రాధ (9)ను అవుట్ చేయడంతో భారత్ విజయానికి దూరమైంది. ఆఖరి ఓవర్లో ప్రేమ రావత్ (8 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా... ఇంకా 4 పరుగుల దూరంలోనే ఉండిపోయింది. మూడు అనధికారిక వన్డేల సిరీస్ బ్రిస్బేన్‌లో 13న జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది.