సరిగ్గా... సమంగా... | India Vs England 3rd Test Day 3 Match Highlights And Full Scorecard | Sakshi
Sakshi News home page

సరిగ్గా... సమంగా...

Jul 12 2025 11:17 PM | Updated on Jul 13 2025 1:48 AM

India Vs England 3rd Test Day 3 Match Highlights And Full Scorecard

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ కూడా 387కే ఆలౌట్‌ 

కేఎల్‌ రాహుల్‌ సెంచరీ 

రాణించిన పంత్, జడేజా 

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2/0

లార్డ్స్‌ మైదానంలో మూడు రోజు ఆట సమంగా ముగిసింది...భారత బ్యాటర్లు పట్టుదలగా నిలబడగా, ఇంగ్లండ్‌ కూడా కీలక సమయాల్లో వికెట్లతో మ్యాచ్‌లో నిలిచింది. సరిగ్గా ఇంగ్లండ్‌ చేసిన స్కోరునే భారత్‌ కూడా తొలి ఇన్నింగ్స్‌లో చేసింది. తొలి సెషన్‌లో రాహుల్‌–పంత్‌ల భాగస్వామ్యం, రెండో సెషన్‌లో జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డిల నిలకడ... భారత్‌ దీటైన స్కోరు చేసేందుకు దోహదం చేసింది. మూడు రోజులైనా ఎవరి పైచేయి ఖరారు కానీ ఈ ‘లార్డ్స్‌’ టెస్టును నేటి నాలుగో రోజే అటో... ఇటో... తేల్చనుంది. నిర్జీవమైన పిచ్‌పై రెండు రోజుల్లో 20 వికెట్లు సాధ్యమా అనేది సందేహమే! డ్రా కు, డ్రామాకు నేడు, రేపు రసవత్తర పోరు జరగనుంది.

లండన్‌: బుమ్రా తన బౌలింగ్‌తో కూలగొట్టిన ప్రదర్శనకు దీటుగా భారత బ్యాటర్లు తలబడ్డారు. ఇంగ్లండ్‌ను సమష్టిగా ఎదుర్కొన్నారు. మూడో రోజంతా ఆడటంలో సఫలమైన టీమిండియా సరిగ్గా... సమానంగా ఇంగ్లండ్‌ చేసిన స్కోరే చేసింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 119.2 ఓవర్లలో 387 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్లలో కేఎల్‌ రాహుల్‌ (177 బంతుల్లో 100; 13 ఫోర్లు) సెంచరీ సాధించాడు. రిషభ్‌ పంత్‌ (112 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (131 బంతుల్లో 72; 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 3, జోఫ్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ మొక్కుబడిగా ఆడిన ఇంగ్లండ్‌ ఒక ఓవర్లో వికెట్‌ నష్టాపోకుండా 2 పరుగులు చేసింది. క్రాలీ (2 బ్యాటింగ్‌), డకెట్‌ (0) క్రీజులో ఉన్నారు. మూడో రోజు మరిన్ని ఓవర్లు ఆడేందుకు ఏమాత్రం ఇష్టపడని ఓపెనర్లు అదే పనిగా బుమ్రా ఓవర్‌ను ఎదుర్కొనేందుకు తాత్సారం చేశారు. దీంతో భారత కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ ఇంగ్లండ్‌ ఓపెనర్ల తీరును తప్పుబట్టాడు. 

రిషభ్‌ పంత్‌ ఫిఫ్టీ  
ఓవర్‌నైట్‌ స్కోరు 145/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లో ఆతిథ్య బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. పిచ్‌ సహకారంతో ఓపెనర్‌ రాహుల్, రిషభ్‌ పంత్‌ సాధికారికంగా ఆడారు. దీంతో ఆరంభంలోనే వికెట్‌ తీసి పట్టుబిగిద్దామనుకున్న ఇంగ్లండ్‌ ఆశలేవీ ఫలించలేదు. బౌలర్లను మార్చినా, స్పిన్‌ను ప్రయోగించినా ఈ జోడీ మాత్రం నింపాదిగానే పరుగులు రాబట్టింది. దీంతో ఈ సెషన్‌ అసాంతం భారత్‌దే పైచేయి అయింది.  ఇద్దరు ఆచితూచి ఆడుతూనే, వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. రాహుల్, రిషభ్‌ల సమన్వయంతో పరుగుల రాకకు ఏ దశలోనూ ఇబ్బంది లేకపోయింది.

చూస్తుండగానే జట్టు స్కోరు 200కు చేరింది. ఎట్టకేలకు లంచ్‌ విరామానికి ముందు ఇంగ్లండ్‌కు పంత్‌ వికెట్‌ రూపంలో ఓదార్పు లభించింది. లేని పరుగుకు ప్రయత్నించిన రిషభ్‌... స్టోక్స్‌ విసిరిన డైరెక్ట్‌ త్రోకు వికెట్‌ను సమరి్పంచుకున్నాడు. ఐదు మంది బౌలర్ల వల్ల కాని పనిని స్టోక్స్‌ ఒక్క త్రోతో విడగొట్టేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 141 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అతని వికెట్‌ పడిన 248/4 స్కోరు వద్దే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. రాహుల్‌ శతకానికి 2 పరుగుల దూరంలో నిలిచాడు.   

రాహుల్‌ శతక్కొట్టిన వెంటనే... 
రెండో సెషన్‌లో రాహుల్‌తో కలిసి జడేజా క్రీజులోకి వచ్చాడు. రాహుల్‌ సెంచరీ చేశాడన్న ఆనందం అతను అవుటవడంతోనే ఆవిరైంది. 176 బంతుల్లో సెంచరీ పూర్తిచేసుకున్న కేఎల్‌ రాహుల్‌... తర్వాత ఒక్క పరుగైన చేయకుండా ని్రష్కమించాడు. టెస్టుల్లో రాహుల్‌కిది పదో సెంచరీ కాగా... క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో రెండో శతకం. 2021–22 సీజన్‌లోనూ అతను శతక్కొట్టాడు. కాగా అతని వికెట్‌ ఇంగ్లండ్‌ శిబిరానికి పెద్ద సాఫల్యం. అదృష్టం కొద్ది సులువైన రనౌట్ల నుంచి నితీశ్‌ బతికిపోవడం జట్టుకు కాస్త ఊరటనిచి్చంది. లేదంటే బ్యాటింగ్‌ చేసే సామర్థ్యమున్న నితీశ్‌ వికెట్‌ కూడా భారత్‌ కోల్పోయేది. జడేజాకు జతగా నితీశ్‌ కుమార్‌ (30; 4 ఫోర్లు) విలువైన పరుగులు చేయడంతో జట్టు స్కోరు 300 దాటింది. 316/5 స్కోరు వద్ద ఈ సెషన్‌ ముగిసింది.  

జడేజా అర్ధ సెంచరీ 
టి విరామం తర్వాత కాసేపటికే నితీశ్‌ వికెట్‌ను పారేసుకున్నాడు. స్టోక్స్‌ బంతిని ఎదుర్కోవడంలో పొరపడిన నితీశ్‌ కీపర్‌ స్మిత్‌ చేతికి క్యాచ్‌ అప్పజెప్పి వెళ్లాడు. తర్వాత క్రీజులోకి వచి్చన వాషింగ్టన్‌ సుందర్‌ (23; 1 ఫోర్, 1 సిక్స్‌) అండతో జడేజా 87 బంతుల్లో ఫిఫ్టీ సాధించాడు. వీళ్లిద్దరి జోడీ కూడా ఆతిథ్య బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో వికెట్‌ తీసేందుకు ఇంగ్లండ్‌ బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. ఏడో వికెట్‌కు సరిగ్గా 50 పరుగులు జతయ్యాక జడేజా అవుటయ్యాడు. ఇతను అవుటైన 11 పరుగుల వ్యవధిలోనే ఆకాశ్‌ దీప్‌ (7), బుమ్రా (0) సుందర్‌ వికెట్లను కోల్పోవడంతో భారత్‌ సరిగ్గా 387 
పరుగుల వద్దే ఆలౌటైంది. 

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ తొలిఇన్నింగ్స్‌: 387; భారత్‌ తొలిఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 13; రాహుల్‌ (సి) బ్రూక్‌ (బి) బషీర్‌ 100; కరుణ్‌ (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 40; శుబ్‌మన్‌ (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 16; పంత్‌ రనౌట్‌ 74; జడేజా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 72; నితీశ్‌ రెడ్డి (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 30; సుందర్‌ (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 23; ఆకాశ్‌ (సి) బ్రూక్‌ (బి) కార్స్‌ 7; బుమ్రా (సి) స్మిత్‌ (బి) వోక్స్‌ 0; సిరాజ్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (119.2 ఓవర్లలో ఆలౌట్‌) 387.

వికెట్ల పతనం: 1–13, 2–74, 3–107, 4–248, 5–254, 6–326, 7–376, 8–385, 9–387, 10–387.
బౌలింగ్‌: వోక్స్‌ 27–5–84–3, ఆర్చర్‌ 23.2–6–52–2, కార్స్‌ 24–5–88–1, స్టోక్స్‌ 20–4–63–2, బషీర్‌ 14.5–2–59–1, జో రూట్‌ 10.1–0–35–0. 
ఇంగ్లండ్‌ రెండోఇన్నింగ్స్‌: క్రాలీ బ్యాటింగ్‌ 2; డకెట్‌ బ్యాటింగ్‌ 0; మొత్తం (1 ఓవర్లో వికెట్‌ నష్టపోకుండా) 2/0. బౌలింగ్‌: బుమ్రా 1–0–2–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement