మెరిసిన షఫాలీ, హర్మన్‌ | India set a target of 193 runs for South Africa in the third T20I | Sakshi
Sakshi News home page

మెరిసిన షఫాలీ, హర్మన్‌

Apr 23 2026 1:03 AM | Updated on Apr 23 2026 1:03 AM

India set a target of 193 runs for South Africa in the third T20I

జొహనెస్‌బర్గ్‌: సిరీస్‌ కాపాడుకోవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్‌ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. బుధవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు 193 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ నిర్దేశించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 పరుగులు సాధించింది. షఫాలీ వర్మ (46 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (38 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 

వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన (25 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి షఫాలీ తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 68 పరుగులు జోడించింది. స్మృతి, జెమీమాలను మలాబా వరుస బంతుల్లో అవుట్‌ చేసింది. జెమీమా స్థానంలో క్రీజులో వచ్చిన హర్మన్‌తో కలిసి షఫాలీ మూడో వికెట్‌కు 73 పరుగులు జత చేసింది. 

షఫాలీ వెనుదిరిగాక వచ్చిన రిచా ఘోష్‌ (10 బంతుల్లో 18 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) కూడా ధాటిగా ఆడింది. అంతకుముందు వర్షం కారణంగా అరగంట ఆలస్యంగా మ్యాచ్‌ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. శ్రీచరణి, అనుష్క శర్మ, క్రాంతి గౌడ్‌ స్థానాల్లో భారతి ఫుల్మాలి, కాశ్వీ గౌతమ్, రేణుక సింగ్‌ తుది జట్టులోకి వచ్చారు. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓడిపోయింది.  

Advertisement
 
Advertisement
Advertisement