ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.
ఓపెనర్ల విభాగంలో పోటీ
ఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్‌లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.
ఇషాన్‌కు చోటు లేదు!
ఇక ఇషాన్ కూడా సన్‌రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆల్‌రౌండర్లు, బౌలర్లు వీరే
ఇక సంజూను వన్‌డౌన్‌లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.
బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.
పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లు
కాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.
అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్‌లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదే
అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.
ప్రాబబుల్స్ జాబితా
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్.


