
టీమిండియా పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు. 45 ఏళ్ల అగార్కర్‌ను భారత జట్టు చీఫ్ సెలక్టర్‌గా నియమించినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కాగా సెలక్షన్ కమిటీ మాజీ చీఫ్ ఛేతన్ శర్మ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో టీమిండియా ఆటగాళ్లు, బోర్డు సభ్యులు, ఇతరత్రా వివరాలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశాడు.
అప్పటి నుంచి ఖాళీగానే ఉన్న చీఫ్ సెలక్టర్ పదవిని అగార్కర్ భర్తీ చేయనున్నాడు. శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ సెలక్షన్ ప్యానల్‌కు అజిత్ అగార్కర్ చైర్మెన్‌గా ఉండనున్నాడు. ఇక సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్‌కు తొలి పరీక్ష వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేయడం.
ఇకఇప్పటికే విండీస్ టెస్టులకు, వన్డేలకు శివ సుందర్ దాస్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే టీ20 జట్టును మాత్రం ఎంపిక చేయలేదు. ఆ బాధ్యతను కొత్త చీఫ్ సెలక్టర్‌కు అప్పగించారు. ఈ క్రమంలో కొత్త చీఫ్ సెలక్టర్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును జూలై రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.
కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్
ఇక విండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో పాటు శుబ్‌మాన్ గిల్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీరి స్ధానంలో ఐపీఎల్‌లో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్, రుత్‌రాజ్ గైక్వాడ్‌లకు అవకాశం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి ముగ్గురు కూడా ఈఏడాది ఐపీఎల్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు
చదవండి: టీమిండియా క్రికెటర్‌కు తప్పిన పెను ప్రమాదం