Ind Vs NZ: రెండో వన్డేలోనూ ఉమ్రాన్‌కు నో ఛాన్స్‌! శార్దూల్‌కే అవకాశం! ఎందుకంటే..

Ind Vs NZ: Wasim Jaffer Dont Think Umran Malik Play 2nd ODI If Plays - Sakshi

India vs New Zealand: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో కూడా టీమిండియా యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు చోటు దక్కే అవకాశం లేదని భారత మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ అన్నాడు. జట్టుకు ప్రస్తుతం ఆల్‌రౌండర్ల అవసరం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌ ఆప్షన్లను పెంచుకునే క్రమంలో స్పిన్‌ లేదంటే పేస్‌ బౌలింగ్‌ చేయగల ఆల్‌రౌండర్లకే అవకాశం ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.

కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌.. ఇద్దరు పేస్‌ ఆల్‌రౌండర్లు, ఓ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ సహా ఓ స్పిన్నర్‌, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగింది. హార్దిక్‌ పాండ్యా, శార్దూల్‌ ఠాకూర్‌లతో పాటు యువ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించింది.

బౌలింగ్‌ విభాగంలో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులో ఉండగా.. పేసర్లు షమీ, సిరాజ్‌ సేవలను ఉపయోగించుకుంది. ఇందులో భాగంగా శార్దూల్‌ ఠాకూర్‌కు అవకాశం ఇచ్చే క్రమంలో ఉమ్రాన్‌ను పక్కనపెట్టాల్సి వచ్చింది.ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ రెండో వన్డేలో జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

శార్దూల్‌ ఉండటం అత్యంత ముఖ్యం
‘‘నాకు తెలిసి ఉమ్రాన్‌కు రెండో వన్డేలో కూడా ఛాన్స్‌ రాకపోవచ్చు. ఒకవేళ తను జట్టులోకి వచ్చినా శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో మాత్రం వస్తాడనుకోను. నా అభిప్రాయం ప్రకారం.. జట్టులో శార్దూల్‌ ఉండటం అత్యంత ముఖ్యం. ఎనిమిదో స్థానంలో తను బ్యాటింగ్‌ చేస్తాడు.

ఇది జట్టుకు అవసరం. గత మ్యాచ్‌లో అతడు బాగానే బౌలింగ్‌ చేశాడు. అలెన్‌ వికెట్‌ సహా ఆఖర్లో యార్కర్‌తో బ్రేస్‌వెల్‌ను బౌల్డ్‌ చేయడం మనం చూశాం. తనకు వికెట్లు తీసే సామర్థ్యం ఉంది. ఒక్కోసారి పరుగులు ధారాళంగా ఇవ్వొచ్చు... కానీ కచ్చితంగా వికెట్లు తీయగలడు. అంతేకాదు బ్యాట్‌తోనూ రాణించగలడు’’ అని వసీం జాఫర్‌ చెప్పుకొచ్చాడు.

ఆల్‌రౌండర్లు కావాలి
జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉంటే ప్రయోజనకరమని అభిప్రాయపడ్డాడు. వరల్డ్‌కప్‌ టోర్నీ సమీపిస్తున్న తరుణంలో మూడో సీమర్‌ కచ్చితంగా ఆల్‌రౌండర్‌ అయి ఉంటే బాగుంటుందని పేర్కొన్నాడు.  కాగా తొలి వన్డేలో శార్దూల్‌ రెండు వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. 7.2 ఓవర్ల బౌలింగ్‌లో 54 పరుగులు ఇచ్చాడు. ఏడు వైడ్లు వేసి విమర్శలు మూటగట్టుకున్నాడు.

అయితే, కీలక సమయంలో వికెట్‌ తీసి జట్టు విజయం ఖరారు చేశాడు. ఇక టీమిండియా ఇన్నింగ్స్‌లో భాగంగా మూడు పరుగులకే రనౌట్‌ అయ్యాడు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్‌ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక రాయ్‌పూర్‌ వేదికగా టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య శనివారం రెండో వన్డే జరుగనుంది. సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉన్న టీమిండియా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది.

చదవండి: పిచ్చిగా మాట్లాడొద్దు.. అతడిని చూసి నేర్చుకో! అంటే.. తనెప్పటికీ టీమిండియాకు ఆడొద్దా? ఫ్యాన్స్‌ ఫైర్‌
Sunrisers: దుమ్మురేపుతున్న సన్‌రైజర్స్‌.. హ్యాట్రిక్‌ విజయాలు.. ఫ్యాన్స్‌ ఖుషీ! ఈసారి..
లార్డ్‌ శార్దూల్‌ ఠాకూర్‌.. ఇలా అయితే ఎలా.. ఇంకెన్ని మ్యాచ్‌లు ఇలా..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top