IND VS NZ 1st ODI: గిల్‌ హల్‌చల్‌.. పోరాడి ఓడిన న్యూజిలాండ్‌

IND VS NZ 1st ODI: India Beat New Zealand By 12 Runs - Sakshi

భారత ఓపెనర్‌ డబుల్‌ సెంచరీ

తొలి వన్డేలో 12 పరుగులతో టీమిండియా విజయం

బ్రేస్‌వెల్‌ వీరోచిత శతకం వృథా  

ఎవరన్నారు వన్డేలకు కాలం చెల్లిందని... ఎవరన్నారు 100 ఓవర్లు చూడటమంటే బోరింగ్, సమయం వృథా అని... హైదరాబాద్‌ స్టేడియంలో బుధవారం మ్యాచ్‌ చూసిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే... భారీగా పరుగులు, సిక్సర్ల వరద, రికార్డులు, ఉత్కంఠ, ఉద్వేగం... ఒక్కటేమిటి అన్ని భావాలు ఉప్పల్‌ మైదానంలో కనిపించాయి. అతి సునాయాస విజయం అనుకున్నది కాస్తా ఆఖరి ఓవర్‌ వరకు వెళ్లింది.

శుబ్‌మన్‌ గిల్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో డబుల్‌ సెంచరీ సాధించి అరుదైన ఆటగాళ్ల జాబితాలో తన పేరు నమోదు చేసుకొని తొలి సగం ఆటలో హైలైట్‌గా నిలిచాడు. అయితే భారత్‌ భారీ స్కోరు చేయగానే  గెలుపు ఖాయం కాలేదు. 21.2 ఓవర్లలో ఏకంగా 219 పరుగులు చేయాల్సిన సుదూర లక్ష్యం ముందుండగా... న్యూజిలాండ్‌ టి20 తరహాలో మెరుపు షాట్లతో పోరాడింది.

మైకేల్‌ బ్రేస్‌వెల్‌ వీర బాదుడుకు భారత శిబిరంలో అలజడి రేగింది. ఒకదశలో టీమిండియా ఓటమి దిశగా కూడా వెళుతున్నట్లు అనిపించింది. చివరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా... రెండో బంతికి ఆఖరి వికెట్‌ తీసి భారత్‌ ఊపిరి పీల్చుకుంది. మొత్తంగా అభిమానులకు ఫుల్‌ వినోదం అందింది.   

సాక్షి, హైదరాబాద్‌: హోరాహోరీ సమరంలో పైచేయి సాధించిన భారత్‌ వన్డే సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం చివరి ఓవర్‌ వరకు ఉప్పల్‌ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్‌ 12 పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (149 బంతుల్లో 208; 19 ఫోర్లు, 9 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అనంతరం న్యూజిలాండ్‌ 49.2 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైంది. మైకేల్‌ బ్రేస్‌వెల్‌ (78 బంతుల్లో 140; 12 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా, మిచెల్‌ సాన్‌ట్నర్‌ (45 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.

వీరిద్దరు ఏడో వికెట్‌కు 17 ఓవర్లలోనే 162 పరుగులు జోడించడం విశేషం. సొంతగడ్డపై తొలి మ్యాచ్‌ ఆడిన పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ 4 కీలక వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లోని రెండో వన్డే ఈనెల 21న రాయ్‌పూర్‌లో జరుగుతుంది.  

కోహ్లి విఫలం...
భారత్‌కు రోహిత్‌ శర్మ (38 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), గిల్‌ మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరు చక్కటి షాట్లతో పరుగులు సాధించడంతో తొలి 10 ఓవర్లలో భారత్‌ 52 పరుగులు చేసింది.  అయితే తక్కువ వ్యవధిలో రోహిత్, కోహ్లి (8), ఇషాన్‌ కిషన్‌ (5)లను అవుట్‌ చేసి న్యూజిలాండ్‌ ఆధిక్యం ప్రదర్శించింది. మరోవైపు గిల్‌ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు.

అతనికి సూర్యకుమార్‌ యాదవ్‌ (26 బంతుల్లో 31; 4 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (38 బంతుల్లో 28; 3 ఫోర్లు) తగిన సహకారం అందించారు. గిల్‌ నాలుగో వికెట్‌కు సూర్యతో 65 పరుగులు, ఐదో వికెట్‌కు హార్దిక్‌తో 74 పరుగులు జోడించాడు. కవర్స్‌లో సులువైన క్యాచ్‌ ఇచ్చి సూర్య వెనుదిరగ్గా... వివాదాస్పద రీతిలో హార్దిక్‌ అవుటయ్యాడు. బంతి హార్దిక్‌ బ్యాట్‌ను తాకకుండానే కీపర్‌ చేతుల్లోకి వెళ్లినట్లుగా, కీపర్‌ చేతులతోనే బెయిల్స్‌ కదిలినట్లుగా టీవీ రీప్లేలో కనిపించింది.

అయితే దీనిపై స్పష్టత లేకపోగా, హార్దిక్‌ను అంపైర్‌ బౌల్డ్‌గా ప్రకటించాడు. 40 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 251 పరుగులకు చేరింది. అయితే కివీస్‌ బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. ఒక దశలో 40–47 ఓవర్ల మధ్య ఒక ఫోర్, ఒక సిక్స్‌ మాత్రమే వచ్చాయి. అయితే చివర్లో గిల్‌ సునామీ బ్యాటింగ్‌ ఒక్కసారిగా ఆటను మార్చేసింది. చివరి 10 ఓవర్లలో భారత్‌ 98 పరుగులు సాధించింది.

ఆ క్యాచ్‌లు పట్టి ఉంటే...
గిల్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. 45 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసిన కీపర్‌ లాథమ్, అదే బంతికి స్టంపింగ్‌ చేసే సునాయాస అవకాశాన్ని కూడా చేజార్చాడు. ఆ తర్వాత షిప్లీ తన బౌలింగ్‌లోనే రిటర్న్‌ క్యాచ్‌ వదిలేసినప్పుడు గిల్‌ స్కోరు 122 పరుగులు.          

మెరుపు భాగస్వామ్యం....
భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మొదటి నుంచీ తడబడింది. ఏ దశలోనూ టీమ్‌ గెలుపు దిశగా సాగుతున్నట్లు అనిపించలేదు. ఆరంభంలోనే ఒకదశలో వరుసగా 23 బంతుల పాటు కివీస్‌ పరుగు తీయలేకపోయింది. ఫిన్‌ అలెన్‌ (39 బంతుల్లో 40; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రం స్వేచ్ఛగా ఆడుతూ హార్దిక్‌ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు, సిక్స్‌ కొట్టడం విశేషం. అనంతరం మిడిలార్డర్‌లో 19 పరుగుల వ్యవధిలో జట్టు 3 కీలక వికెట్లు కోల్పోయింది. అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (24) కూడా ప్రభావం చూపలేకపోయాడు.

స్కోరు 131/6కు చేరడంతో కివీస్‌ కుప్పకూలేందుకు ఎంతో సమయం లేదనిపించింది. అయితే ఈ దశలో బ్రేస్‌వెల్, సాన్‌ట్నర్‌ భారత బౌలర్లను ఆడుకున్నారు. కొరకరాని కొయ్యలుగా మారిపోయిన వీరిద్దరు చక్కటి షాట్లతో, సమన్వయంతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు.

సాన్‌ట్నర్‌ 38 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, 57 బంతుల్లోనే బ్రేస్‌వెల్‌ శతకం అందుకున్నాడు.ఎట్టకేలకు 17 ఓవర్ల భాగస్వామ్యం తర్వాత సాన్‌ట్నర్‌ను సిరాజ్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ ఊరట చెందింది. అయితే మరో ఎండ్‌లో పోరాటం కొనసాగించిన బ్రేస్‌వెల్‌ విజయానికి చేరువగా తీసుకు రాగలిగాడు.  

స్కోరు వివరాలు
భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) మిచెల్‌ (బి) టక్నర్‌ 34; గిల్‌ (సి) ఫిలిప్స్‌ (బి) షిప్లీ 208; కోహ్లి (బి) సాన్‌ట్నర్‌ 8; ఇషాన్‌ కిషన్‌ (సి) లాథమ్‌ (బి) ఫెర్గూసన్‌ 5; సూర్యకుమార్‌ (సి) సాన్‌ట్నర్‌ (బి) మిచెల్‌ 31; హార్దిక్‌ (బి) మిచెల్‌ 28; సుందర్‌ (ఎల్బీ) (బి) షిప్లీ 12; శార్దుల్‌ (రనౌట్‌) 3; కుల్దీప్‌ (నాటౌట్‌) 5; షమీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 349.
వికెట్ల పతనం: 1–60; 2–88; 3–110; 4–175; 5–249; 6–292; 7–302; 8–345.
బౌలింగ్‌: షిప్లీ 9–0–74–2, ఫెర్గూసన్‌ 10–0–77–1, టిక్నర్‌  10–0–69–1, సాన్‌ట్నర్‌ 10–0–56–1, బ్రేస్‌వెల్‌ 6–0–43–0, మిచెల్‌ 5–0–30–2.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: అలెన్‌ (సి) (సబ్‌) షహబాజ్‌ (బి) శార్దుల్‌ 40; కాన్వే (సి) కుల్దీప్‌ (బి) సిరాజ్‌ 10; నికోల్స్‌ (బి) కుల్దీప్‌ 18; మిచెల్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 9; లాథమ్‌ (సి) సుందర్‌ (బి) సిరాజ్‌ 24; ఫిలిప్స్‌ (బి) షమీ 11; బ్రేస్‌వెల్‌ (ఎల్బీ) (బి) శార్దుల్‌ 140; సాన్‌ట్నర్‌ (సి) కుల్దీప్‌ (బి) సిరాజ్‌ 57; షిప్లీ (బి) సిరాజ్‌ 0; ఫెర్గూసన్‌ (సి) గిల్‌ (బి) హార్దిక్‌ 8; టిక్నర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్‌) 337
వికెట్ల పతనం: 1–28, 2–70, 3–78, 4–89, 5–110, 6–131, 7–293, 8–294, 9–328, 10–337.
బౌలింగ్‌: షమీ 10–1–69–1, సిరాజ్‌ 10–2–46–4, హార్దిక్‌ 7–0–70–1, కుల్దీప్‌ 8–1–43–2, శార్దుల్‌ 7.2–0–54–2, సుందర్‌ 7–0–50–0.  

–సాక్షి క్రీడా ప్రతినిధి  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top