Ind A Vs NZ A 3rd ODI: మూడో వన్డే.. అర్ధ శతకాలతో మెరిసిన సంజూ, తిలక్‌, శార్దూల్‌! స్కోరు ఎంతంటే!

Ind A Vs NZ A 3rd ODI: Sanju Tilak Shardul Half Centuries All Out For 284 - Sakshi

India A vs New Zealand A, 3rd unofficial ODI: న్యూజిలాండ్‌- ఏ జట్టుతో మూడో వన్డేలో భారత ఆటగాడు శార్దూల్‌ ఠాకూర్‌ అర్ధ శతకంతో మెరిశాడు. చెన్నై వేదికగా  జరుగుతున్న మ్యాచ్‌లో ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. 33 బంతులు ఎదుర్కొని.. 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. అదే విధంగా యువ బ్యాటర్‌, హైదరాబాదీ ఆటగాడు తిలక్‌ వర్మ, కెప్టెన్‌ సంజూ శాంసన్‌ సైతం హాఫ్‌ సెంచరీలు సాధించారు. 

కాగా భారత్‌- న్యూజిలాండ్‌ ఏ జట్ల మధ్య మూడు వన్డేల అనధికారిక సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో విజయం సాధించిన సంజూ శాంసన్‌ సేన.. మంగళవారం(సెప్టెంబరు 27) జరుగుతున్న మూడో వన్డేలో మెరుగైన స్కోరు నమోదు చేసింది.

రాణించిన సంజూ, తిలక్‌, రిషి, శార్దూల్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌(39 పరుగులు) శుభారంభం అందించాడు. రాహుల్‌ త్రిపాఠి(18 పరుగులు) నామమాత్రపు స్కోరుకే పరిమితం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సంజూ శాంసన్‌ 68 బంతుల్లో 54 పరుగులు సాధించాడు.

ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన తిలక్‌ వర్మ 62 బంతులు ఎదుర్కొని అర్ధ శతకం(50 పరుగులు) సాధించాడు. మరో తెలుగు క్రికెటర్‌ కేఎల్‌ భరత్‌ మాత్రం నిరాశపరిచాడు. 9 పరుగులకే పెవిలియన్‌ చేరాడు.

స్కోరు ఎంతంటే!
ఇక రిషి ధావన్‌ 34 పరుగులు చేయగా.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌ బ్యాట్‌ ఝులిపించాడు. 33 బంతుల్లోనే 51 పరుగులు సాధించాడు. కానీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. 

ఇక ముగ్గురు ఆటగాళ్లు అర్ధ శతకాలతో రాణించడంతో భారత ఏ జట్టు 49.3 ఓవర్లలో 284 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్లలో జాకోబ్‌ డఫీకి రెండు, మాథ్యూ ఫిషర్‌కు రెండు, జో వాకర్‌కు ఒకటి, మైఖేల్‌ రిప్పన్‌కు రెండు, రచిన్‌ రవీంద్రకు ఒక వికెట్‌ దక్కాయి. న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది.

చదవండి: Dinesh Karthik Vs Rishabh Pant: పంత్‌ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్‌ శర్మ
T20 WC 2022: దినేశ్‌ కార్తిక్‌ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top