Ind Vs Aus: నాలుగురన్నరేళ్ల పైనే అయింది.. టెస్టుల్లో రీ ఎంట్రీపై హార్దిక్‌ పాండ్యా​ కీలక వ్యాఖ్యలు

Ind Vs Aus: Hardik Pandya Huge Update On Test Comeback Will Try - Sakshi

Hardik Pandya on Future Plans: ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలిపిన తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దుమ్ములేపుతున్నాడు. ఇప్పటికే కెప్టెన్‌గా పలు టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచి సత్తా చాటాడు. వన్డేల్లోనూ హవా కొనసాగిస్తున్నాడు.

కేఎల్‌ రాహుల్‌ను కాదని పాండ్యాకు వన్డే వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సమీప భవిష్యత్తులోనే పూర్తిస్థాయి సారథిగా పాండ్యా పేరు ఖరారు కానుందనేది బహిరంగ రహస్యమే.

నాలుగున్నరేళ్లు దాటింది
ఇదిలా ఉంటే.. హార్దిక్‌ పాండ్యా​ టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్‌ ఆడి దాదాపు నాలుగున్నరేళ్ల పైనే అయింది. 2017 జూలైలో శ్రీలంకతో మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టుల్లో అడుగుపెట్టిన అతడు.. 2018 ఆగష్టులో ఇంగ్లండ్‌తో ఆడిన మ్యాచ్‌ ఆఖరిది. 

నా మొదటి ప్రాధాన్యం అదే
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన ఆఖరి టీ20లో గెలుపొందిన అనంతరం మీడియాతో మాట్లాడిన పాండ్యా టెస్టుల్లో రీ ఎంట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘ ప్రస్తుతం నేను వైట్‌ బాల్‌ క్రికెట్‌పైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాను. ఇప్పుడు నాకిదే అత్యంత ముఖ్యమైనది. నా మొదటి ప్రాధాన్యం కూడా ఇదే.


ఒకవేళ అన్నీ బాగుండి.. కాలం కలిసొచ్చి.. శరీరం సహకరిస్తే(ఫిట్‌నెస్‌ పరంగా) సంప్రదాయ ఫార్మాట్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటాను’’ అని 29 ఏళ్ల పాండ్యా చెప్పుకొచ్చాడు. సరైన సమయంలో తప్పకుండా టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేస్తానని వ్యాఖ్యానించాడు.

అప్పుడు కూడా ఇలాగే
ఇక గతంలో శ్రీలంకతో సిరీస్‌ సందర్భంగా టీ20 కెప్టెన్‌గా ఎంపికైనపుడు కూడా పాండ్యాకు టెస్టు క్రికెట్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులుగా.. ‘‘వైట్‌ డ్రెస్‌లో ఎప్పుడు కనిపిస్తానంటున్నారా? ముందు బ్లూ జెర్సీతో పూర్తిగా ఆడనివ్వండి. ఆ తర్వాతే వైట్స్‌ గురించి ఆలోచిస్తా’’ అని మాట దాటవేశాడు. కాగా ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీమిండియా బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ సమరానికి సన్నద్ధమవుతున్న వేళ పాండ్యా పైవిధంగా స్పందించడం గమనార్హం. 

చదవండి: Ian Botham: 'భారత్‌లో టెస్టు క్రికెట్‌ చచ్చిపోయే దశలో ఉంది'
Shubman Gill: శుబ్‌మన్‌తో జోడీ కలపండి ప్లీజ్‌! ఆ ఛాన్స్‌ లేదు.. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిపోయింది!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top