Virat Kohli: ఆరేళ్లలో ఇదే తొలిసారి.. అయినా నీకే ఎందుకిలా? ఇప్పటికైనా కళ్లు తెరువు.. లేదంటే!

ICC Test Rankings: Fans Slam Virat Kohli Poor Form 1st Time In 6 Years - Sakshi

ICC Test Rankings- Virat Kohli Rank: టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గత కొన్నాళ్లుగా పేలవ ఫామ్‌ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు మ్యాచ్‌లోనూ మరోసారి విఫలమయ్యాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 11 పరుగులు చేసిన కోహ్లి.. రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులకు అవుట్‌ అయ్యాడు.

ఈ నేపథ్యంలో తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లి ర్యాంకు నాలుగు స్థానాలు దిగజారింది. దీంతో అతడు టాప్‌-10లో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లి 714 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. కాగా గత ఆరేళ్లలో కోహ్లి టాప్‌-10 ర్యాంకు కూడా సాధించలేకపోవడం ఇదే తొలిసారి.

ఇలా ‘రన్‌మెషీన్‌’ స్థాయి రోజురోజుకూ పడిపోవడంపై అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఏంటిది కోహ్లి.. నీకే ఎందుకిలా జరుగుతోంది. ఇకనైనా బ్యాట్‌ ఝులిపించు ప్లీజ్‌’’ అని విజ్ఞప్తి చేస్తున్నారు. 

అదే విధంగా ఐదో టెస్టులో కోహ్లి- ఇంగ్లండ్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో మధ్య వాగ్వాదాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రకృతి కూడా వీరిద్దరి వైరం కొనసాగాలని కోరుకుంటుందేమో! అందుకే ర్యాంకింగ్స్‌లో విరాట్‌ స్థానాన్ని బెయిర్‌స్టో ఆక్రమించాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అద్భుత శతకంతో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో తోడ్పడ్డ బెయిర్‌స్టో ఏకంగా 11 స్థానాలు ఎగబాకి పదో ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.  

ఇదిలా ఉంటే మరికొంత మంది నెటిజన్లు... ‘‘ఇప్పుడు కూడా కోహ్లి కళ్లు తెరవకపోతే.. ఎవరూ అతడికి సాయం చేయలేరు. నిర్లక్ష్యఫు షాట్లు మానుకోవాలి. లేదంటే తుది జట్టులో కూడా స్థానం కోల్పోతాడు. ఆరోజు దగ్గర్లోనే ఉందనిపిస్తోంది’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

చదవండి: Ind Vs WI 2022: విండీస్‌తో సిరీస్‌.. శిఖర్‌ ధావన్‌కు బంపరాఫర్‌.. వన్డే జట్టు కెప్టెన్‌గా.. బీసీసీఐ ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top