ఐసీసీ చైర్మన్‌ బరిలో ఇద్దరే!

ICC Chairmen race in Greg Barclay vs Imran Khwaja - Sakshi

బార్‌క్లేకు బీసీసీఐ మద్దతు

గట్టిపోటీ ఇస్తున్న ఇమ్రాన్‌ ఖాజా

ముంబై: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌ పదవి రేసు నుంచి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ తప్పుకోవడంతో ఇప్పుడు ప్రధానంగా గ్రెగ్‌ బార్‌క్లే (న్యూజిలాండ్‌), ఇమ్రాన్‌ ఖాజా (సింగపూర్‌)ల మధ్య పోటీ ఏర్పడింది. డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో ఈ ఇద్దరి నుంచే ఎవరో ఒకరు చైర్మన్‌ అయ్యే అవకాశముంది. కాగా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ బార్‌క్లేకు బీసీసీఐ మద్దతు ఇస్తుంది. భారత బోర్డుతో పాటు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలు కూడా బార్‌క్లే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. మరోవైపు పాక్‌ బోర్డు (పీసీబీ) సహా ఐసీసీ స్వతంత్ర మహిళా డైరెక్టర్‌ ఇంద్ర నూయి, పలు బోర్డులు ఇమ్రాన్‌ ఖాజాకు మద్దతు పలుకుతున్నాయి.

బార్‌క్లేకు ఐసీసీ శాశ్వత సభ్యదేశాల మద్దతు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికా బోర్డు సంక్షోభంలో ఉండటం తో వారి ఓటు పరిగణించేది లేనిది ఇంకా స్పష్టమవ్వలేదు. శశాంక్‌ మనోహర్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్నప్పటి నుంచి ఇమ్రాన్‌ ఖాజానే తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎందుకనో ఈసారి ఐసీసీ స్పష్టమైన వైఖరి కాకుండా గోప్యత పాటిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ సాధారణ మెజారిటీతో ముగిస్తారా? లేదంటే 3/4 మెజారిటీతో నిర్వహిస్తారో చెప్పనే లేదు. ఐసీసీ అధికారిక వెబ్‌సైట్‌లో స్ట్రక్చర్‌ పేజీని ఉన్నపళంగా ఎందుకు మార్చారో తెలియడం లేదు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిందని చెబుతున్నా... జాబితాను మాత్రం ప్రకటించడం లేదు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top